సున్నా మార్కులొచ్చినా నీట్ పీజీ సీటు.. కీలక నిర్ణయం తీసుకున్న ఎంసీసీ

  • పీజీలో చేరేందుకు విద్యార్థుల అనాసక్తి
  • కటాఫ్ మార్కులు ఎత్తేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం
  • మూడో రౌండ్‌లో సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదన్న ఎంసీసీ
  • దేశవ్యాప్తంగా 13 వేలకు పైగా సీట్లు అందుబాటులో
నీట్ పీజీ సీట్ల భర్తీ కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. సున్నా మార్కులు వచ్చినా అర్హులుగానే గుర్తించి సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించింది. కటాఫ్ మార్కులను ఎత్తివేసిన నేపథ్యంలో మూడో రౌండ్‌లో పీజీ సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ అవకాశం లభిస్తుంది. అంతేకాదు, మూడో రౌండ్‌లో సీట్ల భర్తీ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎంసీసీ తెలిపింది. అవసరం అనుకుంటే ఆప్షన్లు మార్చుకోవచ్చని వివరించింది. 

మొదటి రెండు రౌండ్లలో కన్వీనర్ కోటాలో సీట్లను భర్తీ చేసిన ఎంసీసీ.. మూడో రౌండ్‌కు మాత్రం ఈ నిర్ణయం తీసుకుంది. పీజీ సీట్లలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణం. మార్కులతో సంబంధం లేకుండా సున్నా మార్కులు వచ్చినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్టుగా నిబంధనలు సవరించింది. కాగా, పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో పారా క్లినిక్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సహా పలు పీజీ కోర్సుల్లో దేశవ్యాప్తంగా మూడోరౌండ్ కౌన్సెలింగ్‌కు 13 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.


More Telugu News