ఇమ్రాన్‌ఖాన్‌పై ‘నేరపూరిత కుట్ర’ అభియోగం.. తేలితే మరణశిక్షే!

  • అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఇమ్రాన్‌కు మద్దతుగా మే 9న కార్యకర్తల విధ్వంసం
  • ఆర్మీ స్థావరాలు, హెడ్‌క్వార్టర్స్‌పై దాడులు
  • హింసకు ప్రజలను ప్రేరేపించినట్టు అభియోగాలు
  • ఈ కేసులో బెయిలుపై విడుదలైన మాజీ ప్రధాని
పాకిస్థాన్ పదవీచ్యుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈసారి పెద్ద చిక్కులోనే పడ్డారు. మే 9న జరిగిన హింసకు సంబంధించి ఆయనపై ‘నేరపూరిత కుట్ర’ అభియోగం నమోదైంది. దీంట్లో ఆయన దోషిగా తేలితే గరిష్ఠంగా మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అవినీతి కేసులో ఇమ్రాన్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. రావల్పిండిలోని మిలటరీ హెడ్‌క్వార్టర్స్, స్థావరాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు దిగారు. కొన్నింటిని తగలబెట్టేశారు. 100కుపైగా పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఇమ్రాన్ ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యారు.

ఆర్మీ స్థావరాలపై దాడులకు సూత్రధారిగా వ్యవహరించడం, హింసకు ప్రజలను ప్రేరేపించడం వంటి అభియోగాలపై ఇమ్రాన్‌పై తాజాగా అభియోగాలు నమోదైనట్టు పంజాబ్ పోలీసులు తెలిపారు. మే 9న వందలాదిమంది ఇమ్రాన్ మద్దతుదారులు లాహోర్ కార్ప్స్ కమాండర్ నివాసంతోపాటు అస్కరీ టవర్‌పై దాడులకు దిగారు. 

లాహోర్ పోలీస్ సీనియర్ దర్యాప్తు అధికారి అనూస్ మసూద్ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇమ్రాన్‌ఖాన్, ఆయన పార్టీ పీటీఐ నాయకులు, కార్యకర్తలపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదైనట్టు చెప్పారు. ఆయనపై నమోదైన ఈ అభియోగాలు కనుక తేలితే గరిష్ఠంగా మరణశిక్ష ఖాయమని న్యాయనిపుణులు చెబుతున్నారు.


More Telugu News