కెనడాతో వివాదం నేపథ్యంలో అక్కడి ఎన్నారైలకు కేంద్రం కీలక సూచన

  • ఎక్స్ వేదికగా పలు సూచనలు జారీ చేసిన విదేశాంగ శాఖ ప్రతినిధి
  • కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నాయని వ్యాఖ్య
  • వీటిని వ్యతిరేకించేవారికి బెదిరింపులు ఎదురుకావచ్చని హెచ్చరిక
  • గతంలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలకు వెళ్లొద్దని ఎన్నారైలు, భారతీయ విద్యార్థులకు సూచన
కెనడాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో అక్కడి ఎన్నారైలు, భారత విద్యార్థులకు కేంద్రం తాజాగా కీలక సూచన చేసింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ ఆమోదంతో నేరాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నందున నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారత్‌లోని కెనడా పౌరులకు అక్కడి ప్రభుత్వం ఇలాంటి జాగ్రత్తలే చెప్పిన మరుసటి రోజే కేంద్రం ఎన్నారైలకు ఈ సూచనలు చేయడం గమనార్హం. 

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ‘ఎక్స్’ వేదికగా కెనడాలోని ఎన్నారైలను ఈ మేరకు హెచ్చరించారు. భారత వ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకించే భారతీయ దౌత్యవేత్తలు, భారతీయులకు బెదింపులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి, గతంలో అలాంటి ఘటనలు జరిగిన ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. అయితే, కెనడాలోని భారత దౌత్యకార్యాలయాలు స్థానిక అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఎన్నారైల భద్రత కోసం కృషి చేస్తున్నాయని భరోసా ఇచ్చారు. 

కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చంటూ ఆ దేశ ప్రధాని ట్రూడో సంచలన ఆరోపణలు చేశాక ఇరు దేశాల మధ్య వివాదం పతాకస్థాయికి చేరిన విషయం తెలిసిందే.


More Telugu News