జీ20 సమావేశాలకు ముందే భారత్‌‌ను టార్గెట్ చేసిన కెనడా.. మోదీకి ఇబ్బందని అమెరికా సైలెన్స్

  • భారత్, కెనడా వివాదంపై వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనం
  • మిత్రదేశాలతో నిజ్జార్ హత్యపై కెనడా సంప్రదింపులు జరిపినట్టు వెల్లడి
  • భారత్ తీరును బహిరంగంగా ఖండించాలని కోరిన కెనడా
  • జీ20 సమావేశాలకు ముందు ఈ అంశంపై స్పందించేందుకు అమెరికా సహా పలు దేశాల విముఖత
  • మోదీకి జీ20 సమావేశాలు కీలకమని భావించి సంయమనం పాటించినట్టు వెల్లడి
కెనడా పౌరుడు, ఖలిస్థానీ వేర్పాటువాద మద్దతుదారుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనేందుకు తమ వద్ద విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. అయితే, జీ20 సమావేశాలకు ముందే కెనడా తన మిత్రదేశాలతో నిజ్జర్ హత్య విషయమై సంప్రదింపులు జరిపిందని వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఓ కథనం ప్రచురించింది. భారత్ తీరును బహిరంగంగా ఖండించాలని విజ్ఞప్తి చేసిందని వెల్లడించింది. 

అయితే, అమెరికా సహా అనేక దేశాలు ఈ తరహా ప్రకటన చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని పేర్కొంది. జీ20 సమావేశాలు ప్రధాని మోదీకి కీలకమని భావించిన ఆయా దేశాలు బహిరంగ ప్రకటనకు వెనకాడాయని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అంతేకాదు, భారత్‌తో దౌత్యసంబంధాలు నెరపడంతో అమెరికాకు ఎదురవుతున్న సవాళ్లకు ఇది ఓ నిదర్శనమని కూడా వ్యాఖ్యానించింది. తనతో పాటుగా ఫైవ్ ఐస్ దేశాలుగా పేరుపడ్డ అమెరికా, బ్రిటన్, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలతో కెనడా ఈ సంప్రదింపులు జరిపినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. 

హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత ప్రభుత్వం 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిని భారత్‌కు రప్పించే దిశగా కెనడాతో చర్చలు జరుపుతోంది. 2022లో పంజాబ్‌లో ఓ అర్చకుడి హత్య వెనకు అతడి పాత్ర ఉందని కూడా ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే నిజ్జర్‌ను కెనడాలోని ఓ గురుద్వారా ఎదుట ఇద్దరు ఆగంతుకులు కాల్చి చంపేశారు. 

ఈ హత్య వెనుక భారత్ ఏజంట్ల హస్తం ఉందంటూ ప్రధాని ట్రూడో కెనడా పార్లమెంటులో సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా, భారత దౌత్యవేత్తను కూడా కెనడా బహిష్కరించింది. కెనడా చర్యకు భారత్ దీటుగా స్పందించింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్త ఐదు రోజుల్లోపు దేశం వీడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ దౌత్యవేత్త కెనడా తరపున భారత్‌లో గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అనుమానంతోనే అతడిని భారత్ బహిష్కరించిందని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. 

ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ట్రూడో మరోసారి స్పందించారు. భారత్‌ను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదంటూనే ఈ విషయంపై భారత్ దృష్టిసారించాలని కోరారు.  ఖలిస్థానీ వేర్పాటువాదంపై కఠినచర్యలు తీసుకోవాలంటూ సిక్కులు ఎక్కువగా వున్న కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలపై భారత్ ఒత్తిడి తెస్తోందని కూడా వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. 


More Telugu News