అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ప్రధాన అజెండా ఇదే: బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప
- 2004 నుంచి జగన్ చేసిన అక్రమార్జనను అసెంబ్లీలో వివరిస్తామన్న టీడీపీ నేతలు
- చేసిన తప్పులకు జగన్ జన్మజన్మలకు బాధపడతారని వ్యాఖ్య
- చంద్రబాబు అరెస్ట్ అక్రమమనే అజెండాతో అసెంబ్లీకి వెళ్తున్నామని వెల్లడి
రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించామని చెప్పారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 నుంచి జగన్ చేసిన అక్రమార్జనపై అసెంబ్లీలో వివరిస్తామని వారు తెలిపారు. ఏమీ లేని ఒక కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంచారని మండిపడ్డారు. చంద్రబాబు విషయంలో జరిగింది చూస్తే... వ్యవస్థలను జగన్ ఎలా మేనేజ్ చేస్తున్నారో అర్థమవుతోందని అన్నారు. చేసిన తప్పులకు జగన్ జన్మజన్మలకు బాధ పడతారని చెప్పారు. సొంత డబ్బా కొట్టుకోవడానికే జగన్ అసెంబ్లీ సమావేశాలను పెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే ప్రధాన అజెండాతో అసెంబ్లీకి వెళ్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు.