ప్రధాని ట్రూడూ వాస్తవాలతో ముందుకు రావాలి: కెనడా ప్రతిపక్ష నేత డిమాండ్

  • హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం  ఉందన్న ట్రూడూ   
  • కెనడా ప్రజలు తేల్చుకుంటారన్న ప్రతిపక్ష నేత పొలీవర్  
  • ప్రధాని ఎలాంటి వాస్తవాధారాలను అందించలేదని వ్యాఖ్య  
ఖలిస్థాన్ నేత హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ చేసిన ఆరోపణల పట్ల ఆ దేశ ప్రతిపక్ష నేత, కన్జర్వేటివ్ పార్టీ లీడర్ పిర్రే పొలీవర్ సీరియస్ గా స్పందించారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ తాను చేసిన ఆరోపణలకు సంబంధించి అన్ని వాస్తవాలను ట్రూడూ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

‘‘అన్ని వాస్తవాలతో ప్రధాని స్వచ్ఛంగా ముందుకు రావాలి. అన్ని సాక్ష్యాధారాలను చూడాల్సి ఉంది. అప్పుడే ఈ విషయంలో కెనడా వాసులు ఓ నిర్ణయానికి రాగలరు. ప్రధాని ఎలాంటి వాస్తవాధారాలను అందించలేదు. కేవలం ప్రకటన చేశారు. ప్రైవేటుగా కాకుండా కెనడా ప్రజల ముందే ఆయన మరింత సమాచారాన్ని ఉంచాలని కోరుతున్నాను’’ అంటూ పొలీవర్ మీడియాతో పేర్కొన్నారు. 

నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని పార్లమెంటుకు వెల్లడించడం తెలిసిందే. దీనిపై భారత్ సీరియస్ గా స్పందించడం, రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించుకోవడం చూశాం. భారత వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు, ఖలిస్థానీ వేర్పాటు వాదులకు కేంద్రంగా మారిన కెనడా, దీన్నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నదంటూ భారత్ సీరియస్ గా స్పందించింది.


More Telugu News