బీజేపీ నేత ఫిర్యాదు నేపథ్యంలో.. ఇక ఇండిగోలో స్నాక్స్‌తో పాటు కూల్‌డ్రింక్ ఉచితం!

  • విమానంలో కూల్ డ్రింక్స్ అమ్మకంపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత
  • కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిర్యాదు
  • స్నాక్స్‌తో పాటు ఉచితంగా అందిస్తామని స్పష్టం చేసిన ఇండిగో
విమానంలో ప్రయాణించే సమయంలో కూల్ డ్రింక్స్ కొనలేమని మాజీ ఎంపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విమానాల్లో క్యాన్‌లలో వీటిని అందించడం నిలిపివేసినట్లు ఇండిగో మంగళవారం తెలిపింది. బీజేపీ నేత, మాజీ ఎంపీ స్వపన్ దాస్‌గుప్తా ఇండిగో విమానంలో కూల్ డ్రింక్స్ అమ్మకంపై ఫిర్యాదు చేశారు. అదనపు వసూళ్లతో ప్రయాణికుల్ని పిండడం సరికాదన్నారు. దీంతో ఈ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. శీతల పానీయాలను క్యాన్స్‌లో అందించబోమని, స్నాక్స్‌తో పాటు కాంప్లిమెంటరీగా గ్లాసు జ్యూస్‌ను, కోక్‌ను ఉచితంగా అందించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

ఇండిగో సంస్థపై స్వపన్‌దాస్ గుప్తా కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిర్యాదు చేశారు. శీతల పానీయాల పేరిట దోచుకుంటున్నారని, బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తున్నారని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు. అదనపు దోపిడీని అరికట్టి ప్రయాణికులకు ఊరట కల్పించాలన్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో స్పందించింది. తన మెనూను సవరించింది.

గతంలో, తమ మెనూలో జీడిపప్పు (రూ. 200), కోక్ (రూ.100) ఉందని, దీంతో మొత్తం రూ.300 చెల్లించవలసి వచ్చేదని, ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన మెనూ ప్రకారం స్నాక్స్ కొనుగోలుపై (రూ.200) గ్లాస్ శీతల పానీయం లేదా కోక్ ఉచితంగా అందిస్తామని తెలిపింది. అలాగే ఆన్ బోర్డ్ సర్వీసులు పూర్తిగా కస్టమర్ల ఎంపికకు అనుగుణంగా ఉంటాయని తెలిపింది.


More Telugu News