గ్లాసు గుర్తు తిరిగొచ్చినందుకు పవన్ కల్యాణ్ సంతోషం

  • ఓటింగ్ శాతం లేదని, కనీస ప్రాతినిధ్యం లేదని గతంలో గ్లాసు గుర్తు తొలగింపు
  • ఈసీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసిన జనసేన నాయకత్వం
  • గ్లాసు గుర్తును తిరిగి జనసేన పార్టీకే కేటాయించిన ఎన్నికల సంఘం
  • ఈసీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్ 
ఓటింగ్ శాతం లేకపోవడం, చట్టసభల్లో కనీస ప్రాతినిధ్యం లేకపోవడంతో జనసేన పార్టీ కొన్ని నెలల కిందట గ్లాసు గుర్తును కోల్పోయిన సంగతి తెలిసిందే. గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఎవరైనా ఉపయోగించుకునే వీలున్న ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది. అయితే గ్లాసు గుర్తును తమకే కేటాయించాలన్న జనసేన పార్టీ  విజ్ఞప్తికి కేంద్ర ఎన్నికల సంఘం సమ్మతించింది. గ్లాసు గుర్తును జనసేన పార్టీకే కేటాయిస్తూ ఓ ప్రకటన చేసింది.

దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాసును కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారని పవన్ తెలిపారు. 

ఏపీలో 137 స్థానాల్లో, తెలంగాణలో 7 లోక్ సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారని వివరించారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలకు సేవ చేయడానికి తమ అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, యావత్ సిబ్బందికి పేరుపేరునా తన తరఫున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ ఓ ప్రకటన చేశారు.


More Telugu News