కెనడా ఆరోపణలపై స్పందించిన బ్రిటన్, ఆస్ట్రేలియా
- తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా
- భారత్ అధికారులకు తెలియజేసినట్టు ప్రకటన
- దర్యాప్తు సమయంలో వ్యాఖ్యానించడం సరికాదన్న బ్రిటన్
కెనడా చేసిన ఆరోపణలపై అంతర్జాతీయంగా ఒక్కో దేశం వరుసగా స్పందిస్తోంది. తాము తీవ్రంగా ఆందోళన చెందినట్టు అమెరికా అధ్యక్ష కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు మరో దేశం ఆస్ట్రేలియా సైతం ఇదే మాదిరిగా స్పందించింది. ‘‘ఈ ఆరోపణలపై ఆస్ట్రేలియా ఎంతో ఆందోళన చెందుతోంది. ఈ వ్యవహారంపై కొనసాగుతున్న దర్యాప్తు గురించి తెలుసుకున్నాం. ఈ పరిణామాలపై మిత్ర దేశాలతో సన్నిహిత సంప్రదింపులు చేస్తున్నాం. మా ఆందోళనను భారత సీనియర్ అధికారులకు తెలియజేశాం’’ అంటూ ప్రకటించింది.
అటు బ్రిటన్ సైతం ఈ వ్యవహారంపై స్పందించింది. ‘‘తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కెనడా భాగస్వాములతో సంప్రదింపులు చేస్తున్నాం. కెనడా అధికారులు దర్యాప్తు చేస్తున్నందున దీనిపై వ్యాఖ్యానించడం సరికాదు’’ అని బ్రిటన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. కెనడా చేసిన ఆరోపణలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు అమెరికా ఇప్పటికే స్పందించడం గమనార్హం. జూన్ లో ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ కాల్పుల్లో మరణించగా, దీని వెనుక భారత్ హస్తం ఉందంటూ కెనడా సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.