సిరాజ్ కు ఎస్ యూవీ ఇవ్వాలంటూ సూచన.. ఆనంద్ మహీంద్రా స్పందన
- ఆసియాకప్ ఫైనల్ లో సిరాజ్ అద్భుత ప్రదర్శన
- ప్రత్యర్థుల గురించి తాను ఇంతగా బాధపడింది లేదన్న మహీంద్రా
- అతడికి ఎస్ యూవీ ఇవ్వాలంటూ ఓ యూజర్ సూచన
- ఇప్పటికే ఆ పని చేశామన్న పారిశ్రామికవేత్త
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్ లో కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ట్విట్టర్ లో మహీంద్రా ఎంతో చురుగ్గా ఉంటుంటారు. ఆసక్తికరమైన అంశాలను ఆయన ట్వీట్ల రూపంలో షేర్ చేస్తుంటారు. ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్ లో తన బౌలింగ్ తో ఒంటి చేత్తో భారత్ ను గెలిపించిన సిరాజ్ కు ఒక ఎస్ యూవీ కానుకగా ఇవ్వాలంటూ ఓ యూజర్ ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రాను కోరారు. దీనికి ఆనంద్ మహీంద్రా సమయోచితంగా స్పందించారు.
ఈ నెల 17న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. మహమ్మద్ సిరాజ్ 7 ఓవర్లలో 6వికెట్లు తీసి శ్రీలంక వెన్ను విరిచాడు. ఒక ఓవర్లలోనే నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో శ్రీలంక 50 పరుగులకే చాపచుట్టేసింది. దీనిపై ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. మన ప్రత్యర్థుల కోసం నేను మునుపెన్నడూ ఇంతగా బాధపడింది లేదంటూ శ్రీలంక దయనీయ పరిస్థితిని ప్రస్తావించారు. మనం వారిపై అతీంద్రియ శక్తులను ప్రయోగించినట్టే.. సిరాజ్ నీవు మార్వెల్ అవెంజర్ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ కు ఆశిష్ కుమార్ గుప్తా అనే యూజర్ స్పందిస్తూ.. ‘‘సర్ దయచేసి అతడికి ఓ యూఎస్ వీ ఇవ్వండి’’ అని ఆనంద్ మహీంద్రాను కోరాడు. ఆ పని ఇప్పటికే చేశామంటూ ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. సిరాజ్ కు లోగడే ఆనంద్ మహీంద్రా ఎస్ యూవీని కానుగా ఇచ్చారు. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అతడి ప్రదర్శనకు గాను మహీంద్రా థార్ ను ఇచ్చారు.