వందకి పైగా యుద్ధ విమానాలతో తైవాన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు చైనా యత్నం

  • తైవాన్ తమదే అంటున్న చైనా
  • 24 గంటల వ్యవధిలో తైవాన్ దిశగా 103 చైనా యుద్ధ విమానాలు
  • తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటిన 40 యుద్ధ విమానాలు
  • అసలు 'మధ్య రేఖ' అనేదే లేదంటున్న చైనా
తైవాన్ తమదేనంటూ హుంకరిస్తున్న చైనా మరోసారి దుందుడుకు చర్యలకు తెరదీసింది. వందకు పైగా యుద్ధ విమానాలతో తైవాన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నించింది. 

చైనాకు చెందిన 103 యుద్ధ విమానాలు తమ భూభాగం దిశగా దూసుకు  రావడాన్ని తాము గుర్తించినట్టు తైవాన్ వెల్లడించింది. అందులో 40 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి 'మధ్య రేఖ'ను దాటినట్టు తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో చైనాకు చెందిన 9 యుద్ధ నౌకలు కూడా సముద్ర జలాల్లో దర్శనమిచ్చినట్టు తెలిపింది. ఇదంతా 24 గంటల వ్యవధిలో జరిగిందని తైవాన్ వివరించింది. 

అయితే, చైనా ఈ ఆరోపణలను ఎప్పట్లాగానే ఖండించింది. మేం 'మధ్య రేఖ'ను దాటాం అని చెప్పడానికి అసలు ఆ రేఖ అనేది ఉంటేనే కదా అంటూ వితండవాదం చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ దీనిపై స్పందించారు. తైవాన్ కు చైనాకు నడుమ 'మధ్య రేఖ' అనేదే  లేదని, తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు.


More Telugu News