చంద్రబాబు అరెస్ట్‌పై మరోసారి స్పందించిన పురందేశ్వరి

  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ తీరు అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్య
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను అధికారులు సందర్శించారా? అని నిలదీత
  • మద్య నిషేధమని చెప్పి ఇప్పుడు కోట్లు దోచుకుంటున్నారని ఆగ్రహం
  • మహిళల పుస్తెలు తెంపి శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని విమర్శ
  • రూ.15కు తయారు చేసే మద్యం రూ.600 నుంచి రూ.800కు అమ్ముతున్నారని ఆరోపణ
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మరోసారి స్పందించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ తీరు సందేహాస్పదంగా ఉందన్నారు. కేసు విచారణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో ఒక్కటైనా అధికారులు సందర్శించారా? అని ప్రశ్నించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణను, అవసరమైన సౌకర్యాలను స్కిల్ కేంద్రాల్లో కల్పించినట్లుగా తమ పరిశీలనలో ఉందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తీరును ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.

మద్యం విక్రయంపై పురందేశ్వరి ఆగ్రహం

సీఎం జగన్ పైనా పురందేశ్వరి నిప్పులు చెరిగారు. మద్య నిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతానని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్ ఇప్పుడు మద్యాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం మద్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి చాలా గొప్పగా చెప్పారని, ఇప్పుడు మహిళల పుస్తెలు తెంపి శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారన్నారు. మద్యం తయారీపై గుత్తాధిపత్యం ప్రభుత్వానిదేనని అన్నారు. మద్యం కంపెనీలు తయారు చేసిన మద్యంపై కొంత మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కు సమర్పించుకోవాల్సి ఉంటోందన్నారు.

క్రిసిల్ అంచనాల ప్రకారం ఏపీలో 35 శాతం మంది మద్యం తాగుతారని, అలాగే కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 15 శాతం మద్యం తాగుతారని, కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 80 లక్షల మంది మద్యం సేవిస్తున్నారని, దీని ప్రకారం రోజుకు వచ్చే ఆదాయం రూ.160 కోట్లు, నెలకు రూ.4,800 కోట్లు, ఏడాదికి 57,600 కోట్లుగా ఉంటోందన్నారు. కానీ బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.20వేల కోట్ల ఆదాయం మాత్రమే చూపిస్తున్నారని, మిగతా మొత్తం ఏమవుతుందని ప్రశ్నించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. దీనిని బట్టి అనధికారికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అర్థమవుతోందన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు కూడా అమ్ముతున్నారన్నారు.

రూ.15కే లీటర్ మద్యం తయారు చేసి రూ.600 నుంచి రూ.800కు అమ్ముతున్నారన్నారు. మద్యం విషయంలో వైసీపీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రమాదకర రసాయనాలతో మద్యం తయారు చేస్తున్నారు. ఇదో పెద్ద కుంభకోణమని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. 2019లో మద్యంపై ఏపీకి వచ్చే ఆదాయం రూ.18వేల కోట్ల నుండి రూ.20వేల కోట్లు మాత్రమేనని, కానీ ఇప్పుడు రూ.32వేల కోట్లు వస్తోందన్నారు. ఓటు బ్యాంకు పదిలపరుచుకోవడానికి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారన్నారు.


More Telugu News