నేను అధ్యక్షుడినైతే హెచ్-1బీ వీసా వ్యవస్థను రద్దు చేస్తా: వివేక్ రామస్వామి

  • అమెరికాలో భారత సంతతి రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి సంచలన ప్రకటన
  • హెచ్-1బీ వీసాలను వెట్టి చాకిరీతో పోల్చిన వైనం
  • ఈ వ్యవస్థతో కంపెనీలకే లాభమని విమర్శ
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగేందుకు పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారత సంతతి రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా పగ్గాలు చేపట్టాక లాటరీ ఆధారిత హెచ్-1బీ వీసా వ్యవస్థను రద్దు చేస్తానని ప్రకటించారు. దాని స్థానంలో ప్రతిభ ఆధారిత వీసా వ్యవస్థను ప్రవేశపెడతానని తేల్చి చెప్పారు. 

వివేక్ రామస్వామి హెచ్-1బీ వీసా వ్యవస్థను వెట్టి చాకిరీతో పోల్చారు. ఈ వ్యవస్థతో కంపెనీలకు మినహా దేశానికి ఎటువంటి లాభం లేదన్నారు. పైపెచ్చు.. వీసాదారుల వెంట వచ్చే కుటుంబసభ్యులతో అమెరికాకు మేథోపరమైన లాభం లేకుండా పోతోందని చెప్పుకొచ్చారు. ఈ గొలుసుకట్టు వలసలను నిరోధించాలని అభిప్రాయపడ్డారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. 

మరోవైపు, వివేక్ రామస్వామి స్థాపించిన రోవియంట్ బయోఫార్మా కంపెనీ హెచ్-1బీ వీసా సాయంతో 29 మందిని నియమించుకున్న విషయాన్ని విమర్శకులు ప్రస్తావిస్తున్నారు. అయితే, ఎన్నికల ప్రచారంలోకి దిగాక వివేక్.. కంపెనీ నిర్వహణ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. గతంలో ఆయన కంపెనీ సీఈఓగా, బోర్డు చైర్మన్‌గా వ్యవహరించారు.


More Telugu News