చంద్రబాబునాయుడుకు హెరిటేజ్ మాత్రమే ఉంది... కానీ జగన్ కు...!: పీతల సుజాత

  • చంద్రబాబు అరెస్ట్ పై మాజీ మంత్రి పీతల సుజాత మీడియా సమావేశం
  • జగన్ కు లక్షల కోట్ల విలువ చేసే కంపెనీలు ఉన్నాయని వెల్లడి
  • జగన్ కు పక్క రాష్ట్రం నుంచి సపోర్టు ఉందని వ్యాఖ్యలు
నారా చంద్రబాబునాయుడు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి పీతల సుజాత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 

చంద్రబాబుకు హెరిటేజ్ మాత్రమే ఉందని, కానీ జగన్ కు అధికారికంగా, అనధికారికంగా లక్షల కోట్లు విలువ చేసే కంపెనీలు ఉన్నాయని ఆరోపించారు. 2004లో కేవలం రూ.కోటి 73 లక్షల ఆస్తి మాత్రమే కలిగివున్న జగన్ నేడు లక్షల కోట్లకు అధిపతిగా ఎలా ఎదిగాడు? అని పీతల సుజాత ప్రశ్నించారు. 

"జగన్ అభినవ దుర్యోధనుడిలా చెలరేగిపోతున్నాడు. జగన్ కు పక్క రాష్ట్రం నుంచి సపోర్టు ఉంది. సాక్షి, ఇతర ఛానళ్ల బలముంది... రౌడీలు, మాఫియాల మద్దతు ఉంది. లక్షల కోట్ల నల్లధనం ఉన్న జగన్ తాను ఒంటరివి అనడం ప్రజల్ని మోసం చేయడమే. జగన్ పీఠం త్వరలోనే కూలనుంది. తన లక్షల కోట్ల అవినీతి, లూటీని కప్పిపుచ్చుకునేందుకు ఎదుటివారిపై బురదజల్లుతున్నాడు" అని మండిపడ్డారు.

అభివృద్ధికి చిరునామాగా ఉన్న వ్యక్తి చంద్రబాబు

"అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయానికి చిరునామాగా ఉన్న చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్టు చేయడమే కాకుండా, ఆయనపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల వద్ద సానుభూతి పొందాలని ‘‘నేను ఒంటరివాడిని, సత్యహరిశ్చంద్రుడి’’నని మాట్లాడుతున్నాడు. నేడు రాష్ట్రంలో హై కరప్టెడ్ అధికారులందరూ జగన్ పక్కనే ఉన్నారు. నీ దొంగ నాటకాలకు ప్రజలు మరోసారి మోసపోవటానికి  సిద్ధంగా లేరు. తగిన గుణపాఠం చెబుతారు. 

ఏ ఆధారాలు లేకుండా ఒక్క రూపాయి అవినీతి చేయని వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపారు. రాష్ట్ర ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైంది. ఇక తెలుగు ప్రజల్ని ఆపటం జగన్ తరం కాదు. టీడీపీ, చంద్రబాబే మీ టార్గెట్ అని అర్థమౌతోంది. టీడీపీ బలహీనపడుతుందనుకున్నారు. మేం మరింత స్ట్రాంగ్ అయ్యాం. తెలుగుదేశం సైనికులు ఇంకాస్త బలపడ్డారు. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. వారిలో ఆవేశం కట్టలు తెంచుకొస్తోంది. 

భువనేశ్వరి, బ్రాహ్మణీల కొవ్వొత్తుల ప్రదర్శనకు విశేష స్పందన వచ్చింది!

రాజమండ్రిలో భువనేశ్వరి, బ్రాహ్మణిలు కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తుంటే మహిళలు వేలాదిగా తరలి వచ్చారు. బెంగళూరు, హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు బయటికొచ్చి ధర్నాలు చేస్తున్నారు. లోకేశ్ యువగళానికి సిద్ధమౌతుంటే వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆయన సంకల్ప బలంతో పాదయాత్ర నిర్వహించారు. ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోబోతున్నారు" అని పీతల సుజాత పేర్కొన్నారు.


More Telugu News