భారత బౌలింగ్ వేరే లెవల్... 50 పరుగులకే కుప్పకూలిన లంక

  • ఆసియా కప్ ఫైనల్
  • భారత్ వర్సెస్ శ్రీలంక
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులు
  • 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌట్
  • సిరాజ్ కు 6 వికెట్లు
ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో భారత్ పై ఓడి, ఆ తర్వాత పాకిస్థాన్ పై నెగ్గిన శ్రీలంక ఫైనల్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది. భారత్ ను ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదు అనే రీతిలో ఫైనల్ కు సిద్ధమైంది. కానీ, ఇవాళ ఫైనల్లో కథ మరోలా మారింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. 

స్టేడియంలో ఉన్న లంక అభిమానుల ముఖాలు చూస్తే, తమ జట్టు ప్రదర్శన పట్ల వారు ఎంత షాక్ కు గురయ్యారో అర్థమవుతుంది. స్టేడియంలో ఉన్న కొందరు యువతులు కన్నీటిపర్యంతం కావడం టీవీల్లో కనిపించింది. 

లంక ఇంత దారుణంగా కుప్పకూలడానికి కారణం టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్. సిరాజ్ 7 ఓవర్లలో 21 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి ఆతిథ్య జట్టు వెన్నువిరిచాడు. సిరాజ్ ధాటికి ఓ దశలో లంక 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా... వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (17), వెల్లలాగే (8), దుషాన్ హేమంత (13 నాటౌట్) కాస్తో కూస్తో పరుగులు చేసి పరువు నిలిపారు. లేకపోతే లంక అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుని ఉండేది. 

వన్డేల్లో అత్యల్ప పరుగుల రికార్డు జింబాబ్వే, అమెరికా జట్ల పేరిట ఉంది. ఆ రెండు జట్లు 35 పరుగులకు ఆలౌటయ్యాయి. ఆ ఘోరమైన రికార్డు ఇవాళ లంకకు కొద్దిలో తప్పిపోయింది. 

కాగా, లంక పతనంలో హార్దిక్ పాండ్యా, బుమ్రా కూడా తమ వంతు పాత్ర పోషించారు. హార్దిక్ పాండ్యా 3, బుమ్రా 1 వికెట్ తీశారు. లంక ఇన్నింగ్స్ లో ఐదుగురు బ్యాట్స్ మెన్ ఖాతా కూడా తెరవలేకపోయారు.


More Telugu News