ప్రముఖ రచయిత, ఒడిశా సీఎం సోదరి కన్నుమూత

  • వయసు మీద పడి అనారోగ్యంతో ఢిల్లీలో తదిశ్వాస
  • ఆమె మృతి తనకు బాధను కలిగించిందన్న ప్రధాని మోదీ
  • ట్విట్టర్ లో సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్
ప్రముఖ రచయిత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి (పెద్ద అక్క) గీతా మెహతా వయసు మళ్లిన ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. గీతా మెహతా భర్త ఆమె కంటే ముందే కాలం చేశారు. గొప్ప రచయితగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా, జర్నలిస్ట్ గా గీతా సుపరిచితం. 

1943లో బిజూ పట్నాయక్ దంపతులకు ఆమె ఢిల్లీలో జన్మించారు. భారత్ లోనూ, అనంతరం ఉన్నత విద్యను యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనూ పూర్తి చేశారు. కర్మ కోలా, స్నేక్ అండ్ లాడార్స్, ఏ రివర్ సూత్ర, రాజ్, ది ఎటర్నల్ గణేశ తదితర ప్రముఖ రచనలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. నవీన్ పట్నాయక్ తో ఆమెకు ఆత్మీయ అనుబంధమే ఉంది. ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ఉన్నందుకు ఒడిశా ప్రజలు అదృష్టవంతులని ఆమె లోగడ భువనేశ్వర్ వచ్చిన సందర్భంలో పేర్కొన్నారు. 

గీతా మెహతా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ప్రముఖ రచయిత శ్రీమతి గీతా మెహతా జీ మరణించడం ఎంతో బాధ కలిగించింది. ఆమె బహుముఖ వ్యక్తిత్వం, ఆమె మేథస్సు మరియు రచన, చిత్ర నిర్మాణం పట్ల ఆమెకు ఉన్న అందరికీ పరిచయం. ప్రకృతి, నీటి సంరక్షణ అంటే కూడా ఆమెకు ఇష్టం. ఈ దు:ఖ సమయంలో నా ఆలోచనలు అన్నీ నవీన్ జీ కుటుంబం చుట్టూనే ఉన్నాయి. ఓం శాంతి’’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.


More Telugu News