నిజాం చెర విడిపించేందుకు ఎందరో అమరులయ్యారు.. అమిత్ షా

  • సాయుధ పోరాట వీరులకు వందనం
  • అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన షా
  • తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి
హైదరాబాద్ సంస్థానం విముక్తి కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వారందరి త్యాగాల వల్లే తెలంగాణకు నిజాం చెర వీడిందని వివరించారు. సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందని, ఆయన లేకపోతే మరింత కాలం నిజాం పాలనలోనే ఉండేదని చెప్పారు. ఈమేరకు ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొన్నారు. తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్న సాయుధ వీరులకు వందనాలు తెలిపారు. అంతకుముందు అమరుల స్తూపం వద్ద కేంద్ర హోంమంత్రి నివాళులు అర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి భద్రతా బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. 

పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్న రావి నారాయణ రెడ్డి, కాళోజి నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావు తదితరులను గుర్తుచేస్తూ నివాళులు అర్పించారు. సర్దార్ వల్లభ్ బాయ్ చొరవతో హైదరాబాద్ సంస్థానానికి తొందరగా విముక్తి లభించిందని చెప్పారు. ఆపరేషన్ పోలో పేరుతో పటేల్ హైదరాబాద్ నిజాం మెడలు వంచారని అన్నారు. అయితే, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవం జరపలేదని అమిత్ షా విమర్శించారు. ఈ కార్యక్రమంలోనే ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు.


More Telugu News