మరణం అంచుల వరకు వెళ్లిన వారు ఏం చెప్పారంటే...!

  • ఆసక్తికర అధ్యయనం చేపట్టిన న్యూయార్క్ వర్సిటీ
  • ప్రాణం ఊగిసలాడుతున్న వేళ ఏం జరిగిందో చెప్పిన రోగులు
  • తమ జీవితంలోని ఘట్టాలు కళ్లముందు మెదిలాయన్న కొందరు
  • తండ్రిని చూశానని ఒకరు... గొప్ప కాంతి కనిపించిందని మరొకరు వెల్లడి 
జీవితానికి అంతం... మరణం. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్ మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మృత్యువుపై అత్యంత ఆసక్తికర అధ్యయనం చేపట్టింది. మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన వారి అనుభవాలతో ఆ ఆధ్యయనం సాగింది. 

గుండె ఆగిపోయిన స్థితిలో, స్పృహలో లేకపోయిన్పటికీ, తాము చావబోతున్నామని కొందరు గుర్తించగలిగారని పరిశోధకులు పేర్కొన్నారు. గుండె పనిచేయని స్థితిలో సీపీఆర్ సేవలు అందుకుంటున్న విషయాన్ని కూడా ప్రతి పది మంది రోగుల్లో నలుగురు గుర్తించారట. 

ముఖ్యంగా, ప్రాణం ఊగిసలాడుతున్న క్షణాల్లో ఆయా రోగుల మెదడు పనితీరు దాదాపు గంటపాటు సాధారణంగానే ఉన్నట్టు ఈ పరిశోధనలో పాలు పంచుకున్న శామ్ పర్నియా అనే అసోసియేట్ ప్రొఫెసర్ వెల్లడించారు. సాధారణంగా కార్డియాక్ అరెస్ట్ సంభవించిన 10 నిమిషాల తర్వాత మెదడు పనితీరు నిలిచిపోతుందని ఇప్పటివరకు వైద్యశాస్త్రం భావిస్తోంది. ఇప్పుడు న్యూయార్క్ వర్సిటీ అధ్యయనం ఆ సంప్రదాయక సిద్ధాంతాన్ని సవాల్ చేస్తోంది. 

చావును గెలిచిన 53 మందిలో 40 శాతం మంది తాము మరణం అంచున ఉన్నప్పుడు తమ చుట్టూ ఏం జరుగుతోందో మరింత స్పష్టంగా తెలిసిందని చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా, కళ్లెదుట తమ జీవిత పుస్తకంలోని ప్రతి పేజీ దర్శనమిచ్చిందని, తమ జీవితంలోని వివిధ ఘట్టాలన్నీ కళ్లముందు కదలాడాయని చాలామంది వివరించారు.

దీనిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్నియా స్పందించారు. మెదడు పొరల్లోని ఈ జ్ఞాపకాలు ఓ ఫొటో ఆల్బమ్ లాగా కళ్లముందు మెదులుతాయని, అయితే అవి ఓ వరుస క్రమంలో ఉండవని వివరించారు. ఇతరుల పట్ల తాము ఎలా వ్యవహరించామన్న కోణంలో ఈ జ్ఞాపకాలు బయటికి వస్తాయని తెలిపారు. ఇక, మరికొందరైతే... తమకు ఎంతో బాగా తెలిసిన ప్రదేశానికి, లేక ఇంటికి వెళుతున్నామన్న భావనకు గురయ్యారట. 

ఓ వ్యక్తి గుండెపోటుకు గురైనా సీపీఆర్ తో బతికిబట్టకట్టాడు. ఆ వ్యక్తి న్యూయార్క్ పోస్ట్ మీడియా సంస్థతో మాట్లాడుతూ, తన తండ్రిని చూస్తున్న అనుభూతికి లోనయ్యానని వివరించారు. మరో వ్యక్తి స్పందిస్తూ... తన జీవితంలోని ప్రేమ, సంతోషం, విచారం, గర్వించదగిన క్షణాలు... ఇలా అన్నీ తనపై జాలువారిన ఫీలింగ్ కలిగిందని తెలిపారు. 

మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ఇంకో వ్యక్తి  స్పందిస్తూ... ఆ సమయంలో తనకు దగ్గరగా ఓ కాంతి కిరణం ఉన్నట్టు కనిపించిందని తెలిపారు. ఆ కాంతి ఎంతో శక్తితో తనను ఆవహించినట్టుగా అనిపించిందని, ప్రేమ, సహృదయతను అందించే కాంతిలా ఉందని వివరించారు.


More Telugu News