అభివృద్ధి చేయడమే ఆయన చేసిన నేరమా?.. నారా బ్రాహ్మణి

  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
  • రాజమండ్రిలో నారా బ్రాహ్మణి, భువనేశ్వరి కొవ్వొత్తుల ప్రదర్శన
  • వేలాదిగా తరలివచ్చిన మహిళలు
  • ఏం తప్పు చేశారని చంద్రబాబును అరెస్ట్ చేశారన్న బ్రాహ్మణి
  • యువతను గంజాయి, మద్యానికి బానిసలుగా మార్చుతున్నారని ఆరోపణ 
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రిలో ఈ సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు  తరలివచ్చారు. సేవ్ డెమొక్రసీ, సేవ్ ఏపీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసన ప్రదర్శనలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు. 

భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యానికి ఇది చీకటి దశ అని అన్నారు. 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న విజనరీ నేత నారా చంద్రబాబునాయుడు అని పేర్కొన్నారు. ఐటీని భారతదేశానికి తీసుకువచ్చి, తెలుగు యువతకే కాదు, ఇతర ప్రాంతాల యువతీయువకులకు కూడా అవకాశాలు వచ్చేలా చేసిన నేత చంద్రబాబు అని బ్రాహ్మణి కొనియాడారు. కుటుంబాన్ని కూడా వదిలేసి రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడిన నేత చంద్రబాబు అని వెల్లడించారు. 

అంతటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నారా చంద్రబాబునాయుడు గారిని ఎలాంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారని, దీన్ని తాను ఖండిస్తున్నానని బ్రాహ్మణి స్పష్టం చేశారు. ఆయన కుటుంబ సభ్యురాలిగా కాకుండా, ఒక యువతిగా ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. ఎంతో సీనియర్ నేత అయిన చంద్రబాబుకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఏపీలో సామాన్యులు ఎలా బతకగలుగుతారు? అని ఆక్రోశించారు. యువతకు స్కిల్స్ ఎలా లభిస్తాయి, ఉద్యోగాలు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు.

"నారా చంద్రబాబునాయుడు చేసిన తప్పేంటి? ఆయన అభివృద్ధి చేశారు. సంక్షేమాన్ని అందించారు. లక్షలాదిమంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించారు. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా బాటలు పరిచారు. అభివృద్ధి చేయడం, సంక్షేమం అందించడం, ఇన్ని ఉద్యోగాలు అందించడం నేరమా? ప్రస్తుత ప్రభుత్వ పాలనలో యువతకు ఉద్యోగాలు లభించడంలేదు. యువతను గంజాయి, మద్యానికి బానిసలుగా మార్చుతున్నారు. వారి భవిష్యత్తును ఇలా నాశనం చేయడం చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. 

ప్రస్తుతం చంద్రబాబు ఇక్కడే రాజమండ్రిలో జైలులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేందుకు ఇంత మంది కదిలి వచ్చారంటే అదీ చంద్రబాబు గారి గొప్పదనం. ఇవాళ అన్ని వర్గాల వారు చంద్రబాబుకు బాహాటంగా మద్దతు ఇస్తున్నారు. నేడు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధికులు మహిళలే. వారిలో చాలామంది ఇంటిపట్టున ఉండే గృహిణులే. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

మరోవైపు, జాతీయస్థాయిలో నేతలు, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలు ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఖండిస్తున్నారు. చంద్రబాబుకు హృదయపూర్వక మద్దతు ప్రకటిస్తున్నారు. నాకు మన దేశంలోని న్యాయవ్యవస్థలపై గట్టి నమ్మకం ఉంది. చంద్రబాబు తప్పకుండా విడుదలై, ఏపీలో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని మరోస్థాయికి తీసుకెళతారు" అంటూ  బ్రాహ్మణి ధీమా వ్యక్తం చేశారు. 

కాగా, ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులందరూ చెల్లాచెదురైనట్టున్నారు అని సూటిగా ప్రశ్నించగా, బ్రాహ్మణి తీవ్రంగా స్పందించారు. "ఎవరు చెప్పారండీ... నేను పుట్టి పెరిగిన టీడీపీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్లందరూ ఎవరు? మా కోసం కదలి వచ్చారు... రాష్ట్ర స్థాయిలో, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మాకు మద్దతు ఇస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబం మా వెంట ఉంటే మేం ఒంటరివాళ్లం ఎలా అవుతామండీ" అంటూ ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు దీటుగా జవాబిచ్చారు. 

ఇక, నారా కుటుంబ సభ్యులు తలో చోట ఉండాల్సిన ఈ పరిస్థితులపై మీరెలా స్పందిస్తారు అంటూ మరో విలేకరి నొప్పించకుండా, తెలివిగా నారా బ్రాహ్మణిని అడిగారు. చంద్రబాబు జైల్లో ఉన్నారు, మీరు రాజమండ్రిలో ఉన్నారు, మీ భర్త లోకేశ్ ఢిల్లీలో ఉన్నారు, మీ బిడ్డ దేవాన్ష్ హైదరాబాదులో ఉన్నారు... ఈ పరిస్థితిపై మీరేమంటారు అని ఆ విలేకరి ప్రశ్నించారు. అందుకే బ్రాహ్మణి స్పందించారు. 

ఇలాంటి పరిస్థితి వస్తుందని తాము ఊహించలేదని తెలిపారు. ఎంతో హుందాగా ఉండే మా అత్తయ్య గారు కూడా ఇవాళ బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఆమె ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నది లేదని వివరించారు. చంద్రబాబును రిమాండ్ కు తరలించినప్పటి నుంచి ఆమె రాజమండ్రిలోనే ఉన్నారు... నేను విజయవాడ-రాజమండ్రి మధ్య ప్రయాణాలు చేస్తున్నాను... లోకేశ్ ఢిల్లీలో ఉన్నాడు... దేవాన్ష్ హైదరాబాదులో ఒంటరిగా ఉంటూ స్కూలుకు వెళుతున్నాడు... ఇదేం న్యాయమండీ... అభివృద్ధి చేసినందుకా మాకీ పరిస్థితి? అని బ్రాహ్మణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News