జగన్ తనకు నచ్చిన జాతీయ చానల్ ను ఎంపిక చేసుకుని లోకేశ్ తో చర్చకు రావాలి: అచ్చెన్నాయుడు

  • సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన అచ్చెన్నాయుడు
  • జగన్ ఒక ఫేక్ సీఎం అని విమర్శలు
  • జగన్ నోటివెంట అబద్ధాలు తప్ప నిజాలు బయటికి రావని వ్యాఖ్యలు
  • దమ్ముంటే లోకేశ్ ఛాలెంజ్ ను అంగీకరించాలని సవాల్
జగన్ మోహన్ రెడ్డి పచ్చి అబద్దాలకోరు... ఒక ఫేక్ ముఖ్యమంత్రి... ఆయన నోటి నుంచి అసత్యాలు తప్ప నిజాలు బయటికి రావని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిడదవోలు సభలో కాపునేస్తం పథకానికి నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించిన అచ్చెన్న సీఎం జగన్ ను దుయ్యబట్టారు. 

"జగన్‌రెడ్డికి రాజ్యాంగంపై, కోర్టులపై నమ్మకం లేదు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.40 వేల కోట్లు దోచుకున్న ఆర్ధిక ఉగ్రవాది అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అవినీతి పేటెంట్‌దారుడు జగన్‌రెడ్డే. షెల్ కంపెనీలు పెట్టి క్విడ్‌ ప్రో కోను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జగన్‌. జగన్‌రెడ్డి అవినీతిపై సాక్షాత్తు సీబీఐ, ఈడీలే ఆధారాలు చూపాయి. 

అవినీతి మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై సిగ్గులేకుండా కేసుపెట్టి ఇంకా ప్రజల ముందుకు వచ్చి జగన్‌రెడ్డి మాట్లాడుతున్నాడు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం చూపించగలిగే దమ్ము, ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా? చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి అందినట్లు  జగన్‌రెడ్డి నిరూపించగలడా? 

సీమెన్స్ యాజమాన్యం వచ్చి ప్రాజెక్టు గురించి చంద్రబాబుతో చర్చిస్తే... సీమెన్స్ కు సంబంధమే లేదని జగన్‌రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. సీమెన్స్‌తో చేసుకున్న ఒప్పందం ఫేక్ అని మాట్లాడుతున్న జగన్‌రెడ్డికి చదువొస్తే తాటికాయంత అక్షరాలతో సీమెన్స్ మేనేజింగ్ డైరక్టర్, ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతకాలు చేసిన అగ్రమెంట్ చదువుకోవాలి. 

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుకు కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చినా జగన్‌రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నాడు" అంటూ మండిపడ్డారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు సంతకాలు పెట్టడం తప్పా?

సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టడం తప్పని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. పరిపాలన పరమైన విధాన నిర్ణయాలపై సంతకాలు పెట్టడం తప్పని ఏ రాజ్యాంగంలో ఉంది? క్యాబినెట్ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు సమావేశం జరిగే గదిలోకి ప్రవేశించే ముందు రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి లోపలికి వెళతారు. ఆ రిజిస్టర్‌లో పెట్టిన సంతకం కూడా తప్పని మాట్లాడుతున్న జగన్ రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదని అర్ధమవుతోంది. 

చంద్రబాబుకు వస్తున్న సానుభూతిని, రాష్ట్ర ప్రజల స్పందనను చూసి వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి. అందుకే ప్రతిపక్షనాయకులపై, పవన్ కళ్యాణ్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు బ్రతికే పరిస్థితులు లేవు. పవన్‌కళ్యాణ్ జైలుకు వెళ్లి చంద్రబాబును కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. 

వైసీపీ నాయకులు తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు వాస్తవాలను ప్రజల ముందుంచాలని వెబ్‌సైట్‌ తీసుకొచ్చిన దమ్మున పార్టీ తెలుగుదేశం. జగన్‌రెడ్డికి చదువొస్తే వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ చదువుకోవాలి.

లోకేశ్ ఛాలెంజ్‌కు వైసీపీ సిద్ధమా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై నేషనల్ మీడియాలో చేసిన ఛాలెంజ్‌ను తీసుకునే దమ్ము, ధైర్యం వైసీపీ అధినాయకత్వానికి ఉన్నాయా? వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వ్యక్తిగత ప్రయోజనం కోసం లండన్ వెళ్లి వచ్చిన జగన్‌ రెడ్డికి రాష్ట్ర యువత ఉపాధి కోసం పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై ఢిల్లీ వచ్చి జాతీయ మీడియాలో చర్చించే దమ్ము ఉందా? జగన్‌రెడ్డికి నచ్చిన జాతీయ టీవీ ఛానెల్‌లో డిబేట్‌కు రావాలని ఛాలెంజ్ చేస్తున్నాం. 

అవినీతి కేసుల్లో  జగన్‌ జైలుకెళితే ఒక జగన్‌నే అరెస్టు చేయడం ఘోరం, నేరం అని అరిచి అధికారులను కూడా బాధ్యులను చేయాలని క్రింది స్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి నేడు నీతులు మాట్లాడుతున్నారు.


More Telugu News