83 బంతుల్లోనే 174 పరుగులతో సన్‌రైజర్స్ ఆటగాడి ఊచకోత

  • ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో రెచ్చిపోయిన దక్షిణాఫ్రికా 
  • బ్యాటర్  హెన్రిచ్ క్లాసెన్
  • 13 ఫోర్లు, 13 సిక్సర్లతో వీర విధ్వంసం
  • 164 పరుగుల తేడాతో ఆసీస్ ను ఓడించిన సఫారీ జట్టు
ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించే దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ప్రపంచ కప్ నకు ముందు ప్రత్యర్థి బౌలర్లకు హెచ్చరికలు పంపాడు. నిన్న రాత్రి ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో 83 బంతుల్లోనే 174 పరుగులు బాదాడు. ఇందులో 13 సిక్సర్లు, 13 ఫోర్లు ఉన్నాయి. టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 416/5తో భారీ స్కోరు సాధించింది. వన్డేల్లో సఫారీలకిది మూడో అత్యధిక స్కోరు. 

ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్‌ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. మిల్లర్‌ (82 నాటౌట్‌)తో కలిసి ఐదో వికెట్‌కు 222 రన్స్‌ జోడించాడు. భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 34.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఆ జట్టు 164 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అలెక్స్‌ క్యారీ (99) ఒక్కడే పోరాడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4వికెట్లు తీశాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ను దక్షిణాఫ్రికా 2-2తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య చివరి, ఐదో వన్డే ఆదివారం జరుగుతుంది.


More Telugu News