వారు లేకపోవడం వల్లే ఓడిపోయారా?.. రోహిత్ కు మీడియా ప్రశ్న

  • బంగ్లాదేశ్ చేతిలో చిత్తు అయిన టీమిండియా
  • కీలక ఆటగాళ్లను పక్కన పెట్టి బెంచ్ పై ఉన్న వారికి అవకాశం
  • ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన యువ ప్లేయర్లు
ఆసియా కప్ లో భాగంగా ఫైనల్ కు ముందు చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఊహించని విధంగా ఓడిపోయింది. టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుని తప్పు చేసినట్టుగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ భారత్ ముందుంచిన 265 పరుగుల లక్ష్యం కూడా ఏమంత పెద్దది కాదు. అయినప్పటికీ శుభ్ మన్ గిల్, అక్షర్ పటేల్ మినహా ఒక్కరంటే ఒక్కరూ భారత్ వైపు నుంచి పోరాట పటిమ చూపలేకపోయారు. భారత్ అప్పటికే ఫైనల్ కు చేరుకున్నందున ఈ మ్యాచ్ ఫలితం నామమాత్రమే. దీంతో భారత్ తన తుది జట్టులో మార్పులు చేసింది. కోహ్లీ, పాండ్యా, బుమ్రా, కుల్ దీప్ యాదవ్, సిరాజ్ లకు విశ్రాంతి నిచ్చింది. కీలకమైన వన్డే ప్రపంచకప్ ముందు తమ ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకే ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. 

కీలక ఆటగాళ్లు లేకపోవడం వల్లే భారత్ ఓటమి పాలైందా? అన్న ప్రశ్న మ్యాచ్ అనంతరం మీడియా నుంచి రోహిత్ కు ఎదురైంది. మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని మీడియా ప్రశ్నించింది. ‘‘భవిష్యత్ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు తమ ప్రతిభ చూపించేందుకు కొంత సమయం ఇవ్వాలని అనుకున్నాం. ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని ఆడే అవకాశం కల్పించాలని అనుకున్నాం’’ అని రోహిత్ శర్మ తెలిపాడు. కానీ, వచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, ప్రసిద్ధ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్ సద్వినియోగం చేసుకోలేకపోయారు. మొత్తం మీద కీలక మార్పులతో భారత్ ఓటమి పాలు కావడంపై అభిమానులు మండిపడుతున్నారు.


More Telugu News