సీడబ్ల్యూసీ మీటింగ్ వేళ హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం

  • కరప్ట్ వర్కింగ్ కమిటీ అంటూ గోడలపై భారీ పోస్టర్లు
  • కాంగ్రెస్ అగ్ర నేతల ఫొటోలు.. వాటి కింద స్కామ్ వివరాలు
  • బివేర్ ఆఫ్ స్కామర్స్ కాంగ్రెస్ అంటూ హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తొలిసారి హైదరాబాద్ లో వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తుండడంతో తెలంగాణ పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పార్టీ మాజీ ప్రెసిడెంట్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అగ్ర నేతలు రానుండడంతో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అతిథుల కోసం ప్రముఖ హోటళ్లలో గదులు బుక్ చేయడంతో పాటు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం నుంచే కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లో ల్యాండవుతున్నారు. ఈ క్రమంలో నగరంలో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారీ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు కాంగ్రెస్ శ్రేణులలో కలకలం సృష్టిస్తున్నాయి. 

కరప్ట్ వర్కింగ్ కమిటీ పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సహా కీలక నేతల ఫొటోలు ఉన్నాయి. ఆ ఫొటోల కింద వారు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కామ్ ల వివరాలను ముద్రించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే సహా మొత్తం 24 మంది సీడబ్ల్యూసీ సభ్యుల పేర్లు, ఫొటోలు ఉన్నాయి. ఫొటోల కింద బివేర్ ఆఫ్ స్కామర్స్ అంటూ హెచ్చరికలను కూడా ముద్రించారు. ఈ హెచ్చరికల పక్కనే వైఎస్ఆర్ అన్న అక్షరాలు కూడా ఉన్నాయి. ఈ పోస్టర్లను ఎవరు ముద్రించారు, గోడలపై అతికించింది ఎవరనే వివరాలు తెలియరాలేదు. 

పోస్టర్లలో ఉన్న వారిలో ప్రధానంగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే, ఏకే ఆంటోనిల ఫొటోల కింద నేషనల్ హెరాల్డ్ స్కామ్, మన్మోహన్ సింగ్ ఫొటో కింద కోల్ స్కామ్, మీరా కుమార్ ఫొటో కింద ఎన్ హెచ్ఏ స్కామ్, దిగ్విజయ్ సింగ్ ఫొటో కింద రిక్రూట్ మెంట్ స్కామ్, చిదంబరం ఫొటో కింద ఫోర్జరీ, స్టాక్ మార్కెట్ , శారదా చిట్ ఫండ్, వీసా స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వివరాలు ఉన్నాయి. మిగతా నేతల ఫొటోల కింద కూడా వారి ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వినిపించిన స్కామ్ ల వివరాలను ముద్రించారు. ఈ పోస్టర్లు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి.


More Telugu News