భారత్ శక్తిమంతమైన క్రికెట్ దేశం అయితే కావొచ్చు.. కానీ ఐసీసీ తీరు ఆమోదయోగ్యం కాదు: అర్జున రణతుంగ మండిపాటు

  • ఆసియాకప్‌ సూపర్-4 మ్యాచ్‌లో భారత్-పాక్ పోరుకు రిజర్వు డే
  • ఒక్క మ్యాచ్ కోసం నిబంధనలు మార్చేశారని ఆగ్రహం
  • క్రికెట్‌ను నియంత్రించాల్సిన ఐసీసీని బీసీసీఐ నియంత్రిస్తోందని విమర్శ
ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌కు రిజర్వు డే ప్రకటించడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తగా, తాజాగా శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ ఐసీసీపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దంతాలు లేని పులిలా మారిందని, వృత్తి రహితంగా వ్యవహరిస్తోందని విమర్శించాడు. 

క్రికెట్‌ను ఐసీసీ నియంత్రించాలని, కానీ దానినే మరో దేశం నియంత్రిస్తోందని పరోక్షంగా బీసీసీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఆసియా కప్‌లో ఒకే ఒక్క మ్యాచ్ కోసం నిబంధనలు మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), ఐసీసీ ఇక ఎక్కడున్నాయని ప్రశ్నించాడు. భారత్-పాక్ మ్యాచ్ కోసం ఇకపై ప్రత్యేక నిబంధనలు పెట్టినా, రిజర్వు డే ప్రకటించినా ఇక ఆశ్చర్యపోబోనని పేర్కొన్నాడు.

భారత్ శక్తిమంతమైన క్రికెట్ దేశం అయితే కావొచ్చని, కానీ ఐసీసీ ప్రతినిధులు కోటు ధరించి, సమావేశాల్లో పాల్గొని వెళ్లిపోతామంటే ఎలా అని ప్రశ్నించాడు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, ఒక్క జట్టు కోసం నిబంధనలు మార్చుకుంటూ పోతే భవిష్యత్తులో వైఫల్యం తప్పదని హెచ్చరించాడు. అంతేకాదు, మాజీ క్రికెటర్లు నోరు మెదపకుండా కూర్చోవడానికి కారణం డబ్బేనని విమర్శించాడు.


More Telugu News