నా తల్లిదండ్రులు జయలలిత, శోభన్ బాబు: జె. జయలక్ష్మి

నా తల్లిదండ్రులు జయలలిత, శోభన్ బాబు: జె. జయలక్ష్మి
  • జయలలితకు తానే అసలైన కూతురునన్న జయలక్ష్మి
  • అపోలో ఆసుపత్రిలో కూడా అమ్మను కలిశానని వెల్లడి
  • అఖిల భారత ఎంజీఆర్ మున్నేట్ర కళగం పేరుతో పార్టీని ప్రారంభించానన్న జయలక్ష్మి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తానే అసలైన వారసురాలినని జె.జయలక్ష్మి చెప్పారు. తన తండ్రి దివంగత సినీ నటుడు శోభన్ బాబు అని ఆమె తెలిపారు. అవసరమైతే డీఎన్ఏ పరీక్షకు కూడా తాను సిద్ధమని చెప్పారు. జయలలిత మరణం తర్వాత తానే ఆమె అసలైన కూతురునని జయలక్ష్మి మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ మీడియా ముందుకు వచ్చి తన గురించి చెప్పుకొచ్చారు. 

జయలలిత సినిమాల్లో నటించేటప్పుడు తాను ఆమెతో పాటే పోయెస్ గార్డెన్ లో ఉండేదాన్నని జయలక్ష్మి తెలిపారు. ఆమె రాసుకున్న డైరీ, ఉపయోగించిన దుస్తులు, వస్తువులు తన వద్ద చాలా ఉన్నాయని చెప్పారు. ఎన్నో కారణాల వల్ల తాను జయ కూతురునని అప్పట్లో చెప్పలేకపోయానని వెల్లడించారు. అమ్మ సీఎం అయిన తర్వాత కొన్ని పనులపై రెండు సార్లు కలిశానని, అపోలో ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఓసారి కలిశానని తెలిపారు. అఖిల భారత ఎంజీఆర్ మున్నేట్ర కళగం పేరుతో పార్టీని ప్రారంభించానని, లోక్ సభ ఎన్నికల్లో 39 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. దిండిగల్ జిల్లా కొడైకెనాల్ లో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News