బండరాయితో కొట్టి భార్యను హత్య చేసిన భర్త.. చిన్నారుల సాక్ష్యంతో జీవిత ఖైదు

  • యాదాద్రి భువనగిరిలో ఘటన
  • పిల్లల కళ్లముందే తల్లిని బండరాయితో మోది హత్య చేసిన తండ్రి
  • అనాథలమవుతామని తెలిసినా ధైర్యంగా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పిన చిన్నారులు
  • పిల్లలకు చెరో రూ. 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
‘అమ్మను నాన్నే చంపాడు’ అంటూ పిల్లలు ఇచ్చిన సాక్ష్యంతో ఓ వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ధైర్యంగా సాక్ష్యం చెప్పి తల్లిని చంపిన తండ్రికి శిక్ష విధించేలా చేసిన చిన్నారులను కోర్టు అభినందించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. భువనగిరిలోని హనుమాన్‌వాడకు చెందిన రాపాక నాగరాజు, కవి (37) దంపతులు. వీరికి 12 ఏళ్ల కుమారుడు, 4 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కూలి పనులు చేసే నాగరాజు మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. దీంతో రోజూ ఇంట్లో గొడవలు జరిగేవి.

ఏప్రిల్ 2019లో ఓ రోజు అర్ధరాత్రి నాగరాజు మరోమారు మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నాడు. ఇది భార్యాభర్తల మధ్య మరోమారు గొడవకు కారణమైంది. అది మరింత ముదరడంతో క్షణికావేశంలో నాగరాజు పిల్లల ముందే భార్యను బండరాయితో తలపై మోది హత్యచేశాడు. ఈ కేసులో నాలుగేళ్లపాటు జరిగిన విచారణ అనంతరం నిన్న భువనగిరి జిల్లా కోర్టు తుది తీర్పు వెలువరించింది.

పిల్లల సాక్ష్యంతో నిందితుడు నాగరాజును దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. తండ్రి జైలుకు వెళ్తే తాము అనాథలం అవుతామని తెలిసినా ధైర్యంగా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పిన చిన్నారులను కోర్టు అభినందించింది. వారి భవిష్యత్తు కోసం చెరో రూ. 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


More Telugu News