అనంతనాగ్ లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఎన్ కౌంటర్.. మరో జవాను దుర్మరణం

  • డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలతో ఆపరేషన్ ఉద్ధృతం 
  • గాయాలతో ప్రాణాలు విడిచిన మరో జవాన్
  • ఈ ఆపరేషన్ లో ఇప్పటికే మొత్తం నలుగురు జవాన్ల మృతి
జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఆర్మీ, ఓ పోలీసు అధికారిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. అనంతనాగ్ జిల్లాలో మంగళవారం రాత్రి మొదలైన జాయింట్ ఆపరేషన్ ఇప్పటికీ తెరిపిన పడలేదు. ఈ ఎన్ కౌంటర్ లో తొలుత ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఒకరు కనిపించకుండా పోయారు. గాయాలతో ఒక జవాను శుక్రవారం మరణించాడు. 

కోకెర్ నాగ్ అనే దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఆర్మీ కల్నల్ సింగ్, మేజర్ ధ్యాంచెక్ తోపాటు జమ్మూ కశ్మీర్ పోలీస్ శాఖకు చెందిన డీఎస్పీ అధికారి హిమయూన్ భట్ ఉగ్రవాదుల కాల్పులతో తొలుత మరణించారు. దీంతో అప్పటి నుంచి జాయింట్ ఆపరేషన్ ఉద్ధృతంగా కొనసాగుతూనే ఉంది. అత్యాధునిక ఆయుధాలను వినియోగిస్తున్నారు. డ్రోన్లతో బాంబులను విడుస్తున్నారు. దట్టమైన అడవిలో నక్కిన ఉగ్రవాదులను ఏరివేసే లక్ష్యంతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 

శుక్రవారం భద్రతా బలగాలు తమ దాడిని మరింత తీవ్రతరం చేశాయి. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. మరోవైపు మరణించిన కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధ్యాంచెక్ మృతదేహాలను శుక్రవారం ఉదయం పానిపట్ కు తరలించారు. డీఎస్పీ హుమయూన్ భట్ కు బుద్గాంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఉగ్రవాదుల చేతుల్లో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా జమ్మూ పట్టణంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. 


More Telugu News