దేశంలో ఐదు భారీ షాపింగ్స్ మాల్స్ ఇవి..!
- హైటెక్ సిటీ సమీపంలోని శరత్ సిటీ మాల్ దేశంలోనే పెద్దది
- 27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు
- రెండో స్థానంలో లక్నోలోని లులూ ఇంటర్నేషనల్ మాల్
మనదేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుండడం, ఏటేటా స్థిరమైన వృద్ధి, పెరుగుతున్న ఉపాధి కల్పన ఇవన్నీ షాపింగ్ సంస్కృతిని విస్తరించేలా చేస్తున్నాయి. దీంతో దేశ, విదేశీ సంస్థలు భారత్ లో భారీ షాపింగ్స్ మాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ లో ఐకియా స్టోర్ చూసిన వారికి.. ఇంత పెద్ద షాపింగ్ మాలా? అనిపిస్తుంది. కానీ, ఇంతకంటే భారీ షాపింగ్ మాల్స్ మన దేశంలో చాలానే ఉన్నాయి.
దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ మన హైదరాబాద్ లోనే ఉంది. హైటెక్ సిటీ సమీపంలోని శరత్ సిటీ మాల్ దీని చిరునామా. దీని యజమాని శరత్ గోపాల్ బొప్పన్న. ఈ మాల్ ఏడు జోన్లుగా, ఆరు ఫోర్లలో విస్తరించి ఉంటుంది. 27,00,000 చదరపు అడుగుల పరిధిలోని ఈ మాల్ లో.. రిటైల్ స్పేస్ 19,31,000 చదరపు అడుగుల మేర ఉంది. మిగిలినది పార్కింగ్ కోసం కేటాయించారు. ఇందులోనే షాపింగ్, డైనింగ్, వినోద సేవలు అందుబాటులో ఉంటాయి. ఏడు స్క్రీన్ల ఎఎంబీ సినిమాస్ కూడా ఇందులో ఉంది.
రెండో అతిపెద్ద మాల్ గా లక్నోలోని లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ను చెప్పుకోవచ్చు. అబుదాబికి చెందిన లులూ గ్రూప్ దీన్ని 2022లో ఏర్పాటు చేసింది. ఈ మాల్ 2.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. రూ.2,000 కోట్లతో ఈ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేయడాన్ని గమనించొచ్చు. 300కు పైగా దేశ, అంతర్జాతీయ బ్రాండ్లు ఇక్కడ విక్రయాలు నిర్వహిస్తున్నాయి. 1,600 సీట్ల ఫుడ్ కోర్ట్, 25 వరకు క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.
ఢిల్లీలోని డీఎల్ఎఫ్ మాల్ మూడో స్థానంలో ఉంది. దీని విస్తీర్ణం 2 లక్షల చదరపు అడుగులు. 2016 ఫిబ్రవరిలో ఇది ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు సమీపంలో సెక్టార్ 18లో ఉంది. ఐదు జోన్లు, ఏడు అంతస్తుల్లో షాపింగ్ సేవలు ఉన్నాయి. రూ.1,800 కోట్లతో దీన్ని అభివృద్ధి చేశారు.
తిరువనంతపురంలోని లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ సైతం 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. గ్రౌండ్ కాకుండా, రెండు అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. రూ.2,000 కోట్లతో ఈ షాపింగ్ మాల్ అభివృద్ధి చేశారు. 80,000 చదరపు అడుగుల ఇండోర్ స్టేడియం కూడా ఉంది.
ఢిల్లీలోని సిటీవాక్ 1.3 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో ఏర్పాటైంది. దీన్ని 2007లో ప్రారంభించారు. మొత్తం 54 ఎకరాల స్థలంలో, మూడు అంతస్తులుగా ఉంటుంది.