టీడీపీతో పవన్ కల్యాణ్ చేతులు కలపడానికి కారణం ఇదే: జేసీ ప్రభాకర్ రెడ్డి

  • సేఫ్ ఆంధ్రప్రదేశ్ ను పవన్ కోరుకుంటున్నారన్న జేసీ
  • రాష్ట్రాన్ని రక్షించడం కోసం టీడీపీతో చేతులు కలిపారని ప్రశంస
  • ప్రజల కోసం సినిమాలు వదులుకుని వచ్చారని కితాబు
జనసేనాని పవన్ కల్యాణ్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రాన్ని రక్షించడం కోసం టీడీపీతో పవన్ చేతులు కలిపారని చెప్పారు. చంద్రబాబును జైల్లో కలిసిన పవన్ అక్కడ సెటిల్ మెంట్లు చేసుకున్నారని, ప్యాకేజ్ మాట్లాడుకున్నారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని, ఇంకో రెండు సినిమాలు తీసుకుంటే కావాల్సినంత డబ్బు వస్తుందని అన్నారు. చంద్రబాబును కలిసిందే 45 నిమిషాలని... ఆ సమయంలోనే ప్యాకేజీలు, సీట్లు సెటిల్ చేసుకుంటాడా? అని ఎద్దేవా చేశారు. 

పెయిడ్ అంటూ పవన్ గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని... ఒక సినిమా చేస్తే ఆయనకు కోట్ల రూపాయలు వస్తాయని, అయినా సినిమాలను వదులుకుని ప్రజల కోసం వచ్చారని జేసీ కితాబిచ్చారు. తాను పుట్టిన ఏపీ బాగుండాలనే ఆయన టీడీపీతో కలసి నడిచేందుకు ముందుకొచ్చారని చెప్పారు. సేఫ్ ఆంధ్రప్రదేశ్ ను పవన్ కోరుకుంటున్నారని జేసీ చెప్పారు. జగన్ ఒక పర్వెర్టెడ్ అని... ఆయనను ఎర్రగడ్డకు పంపించాల్సిందే అని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తాడిపత్రిలో టీడీపీ శ్రేణులు రిలే నిరాహారదీక్షను చేపట్టాయి. ఈ దీక్షలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో టాలీవుడ్ హీరోలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


More Telugu News