పాలతో అనారోగ్యం.. తాగే వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం

  • పాలను మోతాదుకు మించి తాగడం మంచిది కాదు
  • జీర్ణవ్యవస్థపై భారం.. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు
  • పిల్లలతో ఎక్కువ తాగిస్తే రక్త హీనత సమస్య
ఎన్నో పోషక విలువలు కలిగిన పాలను (మిల్క్) మనలో చాలా మంది రోజువారీగా తాగుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పాల వినియోగం పెద్ద మొత్తంలోనే జరుగుతోంది. ఇప్పుడే కాదు, పూర్వీకుల నుంచి పాలను సేవించడం ఆచరణలో ఉన్నదే. పాలలో క్యాల్షియం, విటమిన్ డీ, ప్రొటీన్ తదితర పోషకాలు ఉంటాయి. ఎముకల బలోపేతానికి, బలమైన రోగ నిరోధకతకు పాలలోని పోషకాలు అవసరమే. కానీ, పరిమితి మించి తాగితే ఆరోగ్యంపై దుష్ప్రభావం కూడా పడుతుంది.

  • పాలను మోతాదుకు మించి తాగితే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే పాలలో లాక్టోజ్ ఉంటుంది. ఇది సహజ షుగర్. దీన్ని అరిగించుకోవడానికి లాక్టేస్ అనే ఎంజైమ్ కావాలి. వృద్ధులకు లాక్టోజ్ పడదు. పరిమితికి మించి పాలను తాగడం వల్ల కడుపుబ్బరం, గ్యాస్, డయేరియా, కడుపులో తిమ్మిర్లు కనిపిస్తాయి. మొత్తం మీద అరుగుదల భారంగా మారుతుంది.
  • పాలలో ప్రొటీన్ తో పాటు ఫ్యాట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా హోల్ మిల్క్ లో ఫ్యాట్ మరీ ఎక్కువ. అందుకని ఎక్కువ మోతాదులో పాలు తాగిన వారు బరువు పెరుగుతారు.
  • ఆహారంలో పోషకాల సమతుల్యత కూడా దెబ్బతింటుంది. ఉదాహరణకు పాలను అధికంగా తాగడం వల్ల శరీరానికి కావాల్సిన మోతాదు కంటే ఎక్కువ క్యాల్షియం, విటమిన్ డీ చేరతాయి. దీంతో కిడ్నీలో రాళ్లు కనిపిస్తాయి.
  • పాలను ఎక్కువగా తాగే వారిలో మొటిమలు కనిపిస్తాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. పాలలో హార్మోన్లు ఉంటాయి. దీనివల్లే మొటిమలు పెరిగిపోతాయి. 
  • పాలను పిల్లలు ఎక్కువగా తాగితే వారిలో రక్త హీనతకు దారితీయవచ్చు. ఆహారం నుంచి వచ్చే ఐరన్ ను శరీరం గ్రహించడంలో పాలు అడ్డంకిగా మారతాయి.
  • పాలల్లో ఉండేది యానిమల్ ప్రొటీన్ అవుతుంది. ఎక్కువగా తాగితే, మూత్రంలో క్యాల్షియం విసర్జన పెరుగుతుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. 
  • పాలకు, పలు రకాల కేన్సర్లకు మధ్య సంబంధాన్ని పరిశోధకులు పలు అధ్యయనాల ద్వారా తెలుకునే ప్రయత్నం చేశారు. ప్రొస్టేట్ కేన్సర్, ఒవేరియన్ కేన్సర్ రిస్క్ ఉంటుందని గుర్తించారు.
  • పాలు కొందరిలో అలర్జీలకు కారణమవుతుంది. జీర్ణపరమైన సమస్యలు కారణమవుతుంది.


More Telugu News