టాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. నటుడు నవదీప్, నిర్మాత రవి ఉప్పలపాటి సహా పరారీలో మరికొందరు

  • డ్రగ్స్ కేసులో ఇటీవల పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నం, కాప భాస్కర్ బాలాజీ
  • వారిచ్చిన సమాచారం ఆధారంగా మాజీ ఎంపీ విఠల్‌రావు కుమారుడు, సినీ దర్శకుడు సుశాంత్‌రెడ్డి సహా పలువురి అరెస్ట్
  • రూ. 11 కోట్ల విలువైన 8 గ్రాముల కొకైన్ స్వాధీనం
  • వెంకటరత్నం బ్యాంకు ఖాతాలోని రూ. 5.5 కోట్లు ఫ్రీజ్ 
టాలీవుడ్‌లో మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. ఈ కేసులో ఇటీవల పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె. వెంకటరత్నం, మరో నిందితుడు కాప భాస్కర్ బాలాజీలను విచారించిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) అధికారులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా ముగ్గురు నైజీరియన్లు, మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ విఠల్‌రావు కుమారుడు దేవరకొండ సురేశ్‌రావు, సినీ దర్శకుడు అనుగు సుశాంత్‌రెడ్డి, చిత్ర పరిశ్రమతో సంబంధాలున్న రాంచంద్, మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 11 కోట్ల విలువైన 8 గ్రాముల కొకైన్, 50 గ్రాముల ఎండీఎంఏ, ఎక్ట్ససీ మాత్రలు, కార్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

వెంకటరత్నం బ్యాంకు ఖాతాలోని రూ. 5.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసిన 13 మంది పరారీలో ఉన్నట్టు నార్కోటిక్స్ అధికారులు తెలిపారు. వీరిలో సినీ నటుడు నవదీప్, షాడో చిత్ర నిర్మాత ఉప్పలపాటి రవి, గచ్చిబౌలిలోని స్నార్ట్ పబ్ యజమాని సూర్య, బంజారాహిల్స్‌లోని బిస్త్రో, టెర్రా కేఫ్ యజమాని అర్జున్, విశాఖపట్టణానికి చెందిన కలహర్‌రెడ్డి సహా మరికొందరు పరారీలో ఉన్నట్టు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ తెలిపారు.


More Telugu News