ఈసారి హిందీ భాషపై వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్

  • హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా ప్రసంగం
  • యావత్ దేశాన్ని హిందీ ఏకం చేస్తుందన్న అమిత్  షా
  • తమిళనాడు, కేరళ రాష్ట్రాలను హిందీ ఎలా కలుపుతుందన్న ఉదయనిధి
  • హిందీ ఒక్కటే గొప్ప భాష అనే భావనను బీజేపీ విడనాడాలని హితవు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, తమిళనాడు క్రీడల శాఖ మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ, హిందూ సంఘాలు ఉదయనిధి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగాయి. 

సనాతన ధర్మం ఓ మహమ్మారి వంటిదని, దాన్ని నిర్మూలించకపోతే చాలా ప్రమాదమని ఉదయనిధి వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యల తాలూకు రగడ సమసిపోకముందే ఉదయనిధి మరోసారి వివాదానికి తెరలేపారు. ఈసారి ఆయన హిందీ భాషపై వ్యాఖ్యలు చేశారు. హిందీ దివస్ (హిందీ భాషా దినోత్సవం) సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని ఉదయనిధి టార్గెట్ చేశారు. 

భారతదేశంలోని వైవిధ్యాన్ని హిందీ ఏకం చేస్తుందని, హిందీ ఏ భాషతోనూ పోటీపడదని అమిత్ షా అన్నారు. దేశ ప్రజలను ఏకం చేసే మార్గం హిందీ భాష అని పేర్కొన్నారు. దీనిపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ఓ నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఏకం చేస్తుందా? అని ప్రశ్నించారు. 

హిందీపై అమిత్ షా మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారని, హిందీ మాత్రమే గొప్ప భాష అనే ఆలోచనను బీజేపీ విడనాడాలని హితవు పలికారు. తమిళనాడు రాష్ట్రంలో తమిళం మాట్లాడతారు, కేరళలో మలయాళం మాట్లాడతారు... ఈ రెండు రాష్ట్రాలను హిందీ కలుపుతుందా, సాధికారత ఎక్కడి నుంచి వస్తుంది? అని ఉదయనిధి ప్రశ్నించారు. హిందీ వల్లే అభివృద్ధి సాధ్యం అనేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.


More Telugu News