జాహ్నవి మృతిపై అమెరికా పోలీసుల చులకన వ్యాఖ్యలపై... కేంద్రానికి సీఎం జగన్ లేఖ

  • అమెరికాలో జనవరిలో రోడ్డు ప్రమాదం
  • కన్నుమూసిన కందుల జాహ్నవి
  • పోలీసు వాహనం ఢీకొట్టిన వైనం
  • ఆమె మరణం గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదన్న అమెరికా పోలీసు అధికారి
  • వీడియో వైరల్... చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరిన సీఎం జగన్
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన కందుల జాహ్నవి అనే విద్యార్థిని మృతి చెందడం తెలిసిందే. జాహ్నవి అమెరికాలో నార్త్ ఈస్ట్రన్ వర్సిటీ సియాటెల్ క్యాంపస్ లో ఐటీ సిస్టమ్స్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. ఆమె రోడ్డు దాటుతుండగా ఓ పోలీస్ వాహనం ఢీకొట్టడంతో మరణించింది. ఈ ఘటన జనవరిలో జరిగింది. 

అయితే, ఆ అమ్మాయి మరణాన్ని పెద్దగా పట్టించుకోనవసరం లేదంటూ అమెరికా పోలీస్ అధికారి ఒకరు వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పుడు తెరపైకి వచ్చింది. అమెరికాలో ఇతర జాతీయుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారనడానికి ఈ వీడియోనే నిదర్శనమని తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ స్పందించారు. కందుల జాహ్నవి మృతి వ్యవహారం, తదనంతర పరిణామాలపై దృష్టి సారించాలంటూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కు లేఖ రాశారు. ఆ వీడియోలో సదరు పోలీసు అధికారి ఆ అమాయక విద్యార్థిని జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడాడని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. 

ఓ నాన్ అమెరికన్ పట్ల ఆ అధికారి అమానవీయ ధోరణిని అందరూ ఖండించాలని, తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రం తరఫున ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ కోరారు. ఈ చర్యలు అమెరికాలో ఉన్న భారతీయుల్లో ధైర్యం పెంపొందించేలా ఉండాలని సూచించారు. 

అమెరికాలో సంబంధిత అధికారులతో దీనిపై చర్చించి, కందుల జాహ్నవి మృతి వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో కేంద్రమంత్రి ఎస్.జై శంకర్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని, జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సీఎం జగన్ అర్థించారు.


More Telugu News