చంద్రబాబుకు పవన్ కల్యాణ్ డూప్... ఆ మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదు: సజ్జల

  • ఇంతకాలం వీరిద్దరు విడివిడిగా ఉన్నట్లు నటించారని విమర్శ
  • బీజేపీని తీసుకు వచ్చే బాధ్యతను పవన్‌పై చంద్రబాబు పెట్టాడని వ్యాఖ్య
  • వైసీపీకి 75 శాతానికి పైగా మద్దతుందని సజ్జల ధీమా
రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ డూప్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ-జనసేన పొత్తుపై పవన్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇంతకాలం వీరిద్దరు విడివిడిగా ఉన్నట్లు నటించారని విమర్శించారు. చంద్రబాబు చెప్పే మాటలనే పవన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. 2019లో చంద్రబాబు కోసమే పవన్ విడిగా పోటీ చేశాడని, ఇప్పుడు కూడా ఆయన కోసమే కలుస్తామని చెబుతున్నారన్నారు. పవన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు.

తమ కూటమిలోకి బీజేపీని తీసుకు వచ్చేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ బాధ్యతను ఆయనకు చంద్రబాబు అప్పగించి ఉంటారన్నారు. జనసేనాని మనసులో ఎప్పుడూ చంద్రబాబే ఉంటారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీకి పాజిటివ్ ఓటు ఉందని, గెలుపు తమదే అన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఓ పార్టీకి ఎప్పుడూ ఈ స్థాయిలో మద్దతు లేదన్నారు. 75 శాతానికి పైగా మద్దతు ఉందన్నారు. తాను ప్రజల నుంచి వస్తోన్న మద్దతుతోనే ఈ మాట చెబుతున్నానన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

సినిమాల్లో చెప్పే డైలాగ్‌లు రాజకీయాల్లో చెబితే జనం హర్షించరని సజ్జల అన్నారు. రియాల్టీకి దగ్గరగా ప్రజలు ఉంటే, పవన్ మాత్రం రీల్‌కు దగ్గరగా ఉన్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో రూ.371 కోట్లు మళ్లించారని ఆరోపించారు. సీమెన్స్ కంపెనీ మాత్రం తమకు ఎలాంటి డబ్బులు రాలేదని చెప్పిందన్నారు. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీలకు ఈ నిధులు వెళ్లాయని చెప్పారు. చంద్రబాబు ముఠా గుడిని, గుడిలోని లింగాన్ని దోచేసిందన్నారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా డబ్బులు దోచేశారన్నారు. అసలు ఒప్పందంలో రూ.3300 కోట్లు అనేదే లేదన్నారు. జీవోలో ఉన్న అంశాలు ఎంవోయూలో లేవన్నారు. అమరావతి స్కాం, స్కిల్ స్కామ్.. అన్నీ బయటకు వస్తాయన్నారు. చంద్రబాబు అడ్డంగా చేసిన తప్పులకు ఆధారాలు ఉన్నాయన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తామనే నమ్మకంతో చంద్రబాబు అక్రమాలు చేశారని, కానీ ఎల్లప్పుడూ మేనేజ్ చేయడం కుదరదన్నారు. అడ్డంగా దొరికిన చంద్రబాబును సుద్దపూస అంటే ఎవరూ నమ్మరన్నారు.


More Telugu News