పాకిస్థాన్ ను ఏకాకిని చేయడమే పరిష్కారం..: కేంద్ర మంత్రి వీకే సింగ్

  • వారిపై ఒత్తిడిని తీసుకురావాలన్న అభిప్రాయం
  • ప్రపంచం నుంచి వేరు చేస్తే తప్ప మార్పు రాదన్న కేంద్ర మంత్రి
  • ఎన్ కౌంటర్ లో ముగ్గురు అధికారుల దుర్మరణంపై ఆవేదన
జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ముష్కరుల దాడిలో ఇద్దరు సైనికాధికారులు, ఓ పోలీసు అధికారి ప్రాణాలు విడవడం పట్ల కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ తీవ్రంగా స్పందించారు. ‘‘మనం దీనిపై ఆలోచన చేయాల్సిందే. పాకిస్థాన్ ను మనం ఏకాకిని చేయనంత వరకు.. వారు దీన్ని సాధారణంగానే చూస్తుంటారు. వారిపై ఒత్తిడి తీసుకొచ్చి, ఒంటరిని చేయాల్సిందే. పాకిస్థాన్ వాస్తవికంగా వ్యవహరించనంత వరకు సాధారణ సంబంధాలు సాధ్యపడవు’’ అని వీకే సింగ్ తేల్చి చెప్పారు.

అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆర్మీ కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ అభిషేక్ ధోనక్, డీఎస్పీ హుమాయూన్ భట్ మరణించగా.. దీనిపై వీకే సింగ్ స్పందనను మీడియా ప్రతినిధులు కోరడంతో పై విధంగా స్పందించారు. ‘‘పాకిస్థాన్ ను ప్రపంచం నుంచి వేరు చేయాల్సిందే. అప్పుడే ఏదైనా సాధ్యపడుతుంది. ఒత్తిడిని తీసుకురావాలి.. కొన్ని సందర్భాల్లో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు, కొన్ని సందర్భాలలో క్రికెట్ సెలబ్రిటీలు ముందుకు రావాలి. కానీ మనం వారిని వేరు చేయాల్సిందే’’ అని వీకే సింగ్ పేర్కొన్నారు.


More Telugu News