బ్యాటు పట్టిన శ్రేయాస్ అయ్యర్.. బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఆడే అవకాశం?
- వెన్ను నొప్పితో సూపర్-4కు దూరంగా ఉన్న అయ్యర్
- తాజాగా టీమిండియా ప్రాక్టీస్ మ్యాచుకు హాజరు
- బంగ్లాదేశ్ తో శుక్రవారం మ్యాచ్ లో చోటుకు అవకాశం
వెన్ను నొప్పి కారణంగా ఆసియాకప్ సూపర్ 4లో మొదటి రెండు మ్యాచులకు దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యర్ మళ్లీ బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేస్తున్నాడు. నిజానికి సూపర్-4 మ్యాచుల్లో అతడు ఆడాల్సి ఉంది. గ్రూప్ దశలో పాకిస్థాన్, నేపాల్ తో జరిగిన మ్యాచుల్లో అతడు పాల్గొన్నాడు. పాకిస్థాన్ పై 14 పరుగులు చేశాడు. సూపర్ 4కు వచ్చే సరికి వెన్ను నొప్పి బాధిస్తుండడంతో ఆటకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చాడు. పాకిస్థాన్ పై మ్యాచ్ లో విరాట్ కోహ్లీతో కలసి రాహుల్ సెంచరీ సాధించడం తెలిసిందే.
అయ్యర్ లేని లోటును రాహుల్ బాగానే భర్తీ చేశాడు. శ్రీలంకపైనా రోహిత్ తర్వాత ఎక్కువ పరుగులు (39) చేసింది రాహుల్ ఒక్కడే. అయితే శుక్రవారం సూపర్-4లో బంగ్లాదేశ్ పై మ్యాచులో రాహుల్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది నామమాత్రపు మ్యాచ్ కావడంతో దీనికి విశ్రాంతినిచ్చి, ఫైనల్ మ్యాచ్ కు తీసుకోవచ్చని భావిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ పై మ్యాచులో అయ్యర్ కు చోటు లభించొచ్చని తెలుస్తోంది. దీనికి నిదర్శనంగా అయ్యర్ బ్యాట్ పట్టి గురువారం టీమిండియా తరఫున ప్రాక్టీస్ మ్యాచులో పాల్గొన్నాడు. ఆసియాకప్ తర్వాత కీలకమైన ప్రపంచకప్ ఉండడంతో దీనికి సన్నాహకంగా అయ్యర్ తో ఆడించొచ్చని తెలుస్తోంది.