‘సనాతన ధర్మం’పై ఇక మాట్లాడకండి.. డీఎంకే శ్రేణులకు స్టాలిన్ సూచన

  • దీన్ని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందన్న ఎంకే స్టాలిన్
  • వారి ట్రాప్ లో పడకూడదంటూ డీఎంకే శ్రేణులకు సూచన
  • బీజేపీ అవినీతి, మతతత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ దూషణగా మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసిన ఇన్ని రోజుల తర్వాత దీనిపై.. ఆ రాష్ట్ర సీఎం, ఉదయనిధి తండ్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. హిందువులు అనుసరించే సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా, ఎయిడ్స్ వ్యాధులతో పోలిస్తూ.. దీన్ని సమాజం నుంచి నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రుల నుంచి, ఎంతో మంది తీవ్రంగా స్పందించారు. తన వ్యాఖ్యల ద్వారా ఉదయనిధి దేశవ్యాప్త చర్చకు తెరతీశారు. 

దీనిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందిస్తూ.. సనాతన ధర్మంపై చర్చకు దూరంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘‘సనాతన ధర్మానికి మద్దతుగా స్పందించాలంటూ ప్రధాని మోదీ తన కేబినెట్ మంత్రులకు కొన్ని రోజుల క్రితం సూచించారు. దీనిపై రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. ఒక కేంద్రమంత్రి ప్రతి రోజూ సనాతన ధర్మంపై మాట్లాడుతూ.. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ట్రాప్ లో మనం పడిపోకూడదు’’ అని స్టాలిన్ వివరించారు. బీజేపీ అవినీతిని ప్రధానంగా ప్రస్తావించాలంటూ సూచించారు. కళంకిత, మతతత్వ, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం నుంచి  దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు.


More Telugu News