ఎవరీ కందుల జాహ్నవి?

  • జాహ్నవి తల్లి ప్రాథమిక పాఠశాల టీచర్
  • అప్పుల భారం ఉండడంతో తీర్చాలనుకున్న జాహ్నవి
  • అది నెరవేరకుండానే రోడ్డు ప్రమాదానికి బలి
అమెరికాలోని సియాటెల్ లో పోలీసు కారు ఢీకొనడంతో మరణించిన కందుల జాహ్నవి కేసు సంచలనంగా మారింది. జనవరి 23న ఈ ఘటన జరగ్గా.. ఆమె మరణంపై సియాటెల్ పోలీసులు హేళనగా మాట్లాడుకున్న మాటలు బాడీ కెమెరాలో రికార్డు కావడం, ఆ క్లిప్ లు బయట పడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఈ కందుల జాహ్నవి? అన్న ఆసక్తి నెలకొంది. 

కందుల జాహ్నవి (23) ఆంధ్రప్రదేశ్ లోని నందిగామలో ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ చదివింది. సౌత్ లేక్ యూనియన్ లో ఉన్న నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. స్టూడెంట్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆమె 2021లో అమెరికాకు వెళ్లింది. జాహ్నవి తల్లి ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. తల్లికి అప్పుల భారం ఉంది. అమెరికాలో ఉన్నత విద్య తర్వాత జాబ్ లో చేరి అమ్మ చేసిన అప్పులు తీర్చాలనుకుంది. తన ప్రాధాన్యత కుటుంబానికి సాయపడడమే. కానీ, విధి ఆమె పట్ల కక్ష గట్టింది.

జనవరి 23న డెక్స్ టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ కూడలి వద్ద రోడ్డు దాటుతోంది. అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్ కారు 119 కిలోమీటర్ల వేగంతో వస్తూ రోడ్డు దాటుతున్న జాహ్నవిని ఢీకొట్టింది. ఆ వేగానికి జాహ్నవి 100 అడుగుల దూరంలో ఎగిరి పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్ కు తరలించగా, అక్కడ మరణించింది. ఆమె ప్రాణానికి ఏమంత విలువ లేదంటూ, 11 వేల డాలర్ల చెక్ రాసిస్తే సరిపోతుందిలే అంటున్న పోలీసు అధికారుల ఫోన్ సంభాషణ వెలుగు చూడగా.. దీనిపై దర్యాప్తునకు భారత కాన్సులేట్ అధికారులు ఇప్పటికే డిమాండ్ చేయడం గమనార్హం.


More Telugu News