రాజకీయంగా పోరాడడం చేతకాని వారే దర్యాప్తు సంస్థలను ఆశ్రయిస్తారు.. అభిషేక్ బెనర్జీ ఫైర్

  • స్కూల్ జాబ్ కుంభకోణం కేసులో ఈడీ ఎదుట హాజరైన అభిషేక్ బెనర్జీ
  • ‘ఇండియా కూటమి’ సమావేశం రోజునే తనకు సమన్లు ఇవ్వడాన్ని ప్రశ్నించిన టీఎంసీ నేత
  • ఎన్నికల సమయంలో టీఎంసీని ఇబ్బంది పెట్టడం పరిపాటిగా మారిందని విమర్శ
  • దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను ప్రశ్నించిన అభిషేక్ 
రాజకీయంగా పోరాడడం చేతకాని వారే దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ విమర్శించారు. బెంగాల్ స్కూల్ జాబ్ కేసులో నిన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరైన ఆయన ఆనంతరం మాట్లాడుతూ.. బీజేపీపై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి సమావేశం రోజునే ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. ఈడీ తనను 12న కానీ, 15న కానీ పిలిచివుంటే ప్రతిపక్షకూటమి సమావేశంలో పాల్గొని ఉండేవాడినని అన్నారు. 

దీనిని బట్టి టీఎంసీని బీజేపీ టార్గెట్ చేస్తోందన్న విషయం అర్థమవుతోందన్నారు. విపక్షాల ఐక్యతకు టీఎంసీ కృషి చేస్తోందని, అందుకనే ఏది ఏమైనా టీఎంసీని ఆపాలని బీజేపీ నిర్ణయించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను ప్రశ్నించిన ఆయన.. బీజేపీ నేతల కేసుల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

నర్మదా కుంభకోణం కేసును సీబీఐ ఏడేళ్లుగా సాగదీస్తోందని విమర్శించారు. బీజేపీలో చేరిన వారికి ఎలాంటి సమన్లు ఉండవని, డబ్బులు తీసుకుంటూ కెమెరాకు దొరికిన వారిని దర్యాప్తు సంస్థలు విచారణకు పిలవవని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు వేధించడం బీజేపీకి పరిపాటిగా మారిందన్నారు. డబులింజన్ ప్రభుత్వం పేరుతో దేశాన్ని బీజేపీ దోచుకుంటోందని ఆరోపించారు.


More Telugu News