అత్యాచారం కేసు పెడతామని గర్ల్‌ఫ్రెండ్ కుటుంబం బెదిరింపు.. వివాహితుడి ఆత్మహత్య

  • మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
  • యువతితో సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ వివాహితుడిపై ఆరోపణలు
  • ఐదు లక్షలు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతామంటూ యువతి కుటుంబసభ్యులు బెదిరించారని వివాహితుడి ఆరోపణ
  • ఫేస్‌బుక్‌లైవ్‌లో యువతి కుటుంబం ఆరోపణలు ఖండిస్తూ ఆత్మహత్యకు పాల్పడిన వైనం
  • నదిలో మృతదేహం లభ్యం, నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
అత్యాచారం కేసు పెడతామంటూ వివాహితుడిపై ఓ యువతి కుటుంబసభ్యులు బెదిరింపులకు దిగడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫేస్‌బుక్‌లో తన బలవన్మరణాన్ని లైవ్ స్ట్రీమ్ కూడా చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. 

ఈ నెల 10న 38 ఏళ్ల మనీశ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ లైవ్‌లో తాను ఎదుర్కొంటున్న బెదిరింపుల గురించి చెప్పాడు. తనను కాజల్ అనే 19 ఏళ్ల యువతి కుటుంబసభ్యులు అత్యాచారం కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. వాళ్లు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, తాను ఈ మొత్తం ఇవ్వకపోతే కేసు పెడతామన్నారని చెప్పాడు. సెప్టెంబర్ 6నే ఆ యువతి తన ఇంట్లోంచి అదృశ్యమైంది. మనీశ్‌తో ఆమె వెళ్లిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. 

మనీశ్‌కు వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఇదంతా చెప్పుకొచ్చిన అతడు యువతి కుటుంబసభ్యుల ఆరోపణలను ఖండించాడు. తనకు యువతితో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. ఆ తరువాత నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

కాగా, ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి మనీశ్‌ కోసం గాలించగా నదిలో అతడి మృతదేహం లభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.


More Telugu News