ప్రపంచ నం.1 ర్యాంక్‌కు చేరువైన భారత ఓపెనర్ గిల్

  • మూడు నుంచి రెండో ర్యాంక్‌కు చేరుకున్న యువ ఆటగాడు
  • టాప్‌10లో నాలుగేళ్ల తర్వాత భారత్‌ నుంచి ముగ్గురికి చోటు
  • ఎనిమిదో ర్యాంక్‌లో కోహ్లీ, తొమ్మిదో స్థానంలో రోహిత్
టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ వన్డేల్లో దూసుకెళ్తున్నాడు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌‌ వన్ ర్యాంక్‌ దిశగా మరో ముందడుగు వేశాడు. కెరీర్‌ లో అత్యుత్తమంగా రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో అతను మూడు నుంచి ఒక స్థానం మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఈ జాబితాలో నాలుగేళ్ల తర్వాత ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్‌10లో చోటు సాధించారు. ఆసియా కప్‌లో వరుసగా మూడు అర్ధ శతకాలు సాధించిన రోహిత్‌ శర్మ పది నుంచి తొమ్మిదో ర్యాంక్‌ కు చేరుకున్నాడు.

పాకిస్థాన్‌పై శతకంతో విజృంభించిన విరాట్‌ కోహ్లీ 11 నుంచి ఎనిమిదో ర్యాంక్‌ కు చేరుకున్నాడు. పాకిస్థాన్‌ నుంచి కూడా ముగ్గురు బ్యాటర్లు టాప్‌10లో నిలిచారు. బాబర్‌ ఆజమ్‌ అగ్రస్థానం నిలబెట్టుకోగా.. ఇమాముల్‌ హక్‌ ఐదు, ఫఖర్‌ జమాన్‌ పదో స్థానంలో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఐదు స్థానాలు మెరుగై ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. పాకిస్థాన్‌పై ఐదు వికెట్లు తీసిన కుల్దీప్.. శ్రీలంకపై నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.


More Telugu News