రాజమండ్రిలో లోకేశ్ తో సమావేశమైన జిల్లాల టీడీపీ నేతలు... కార్యాచరణపై చర్చ

  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
  • రాజమండ్రి నుంచే పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న లోకేశ్
  • నేడు జిల్లాల నేతలతో వివిధ అంశాలపై చర్చ
రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నేతలు భేటీ అయ్యారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం లోకేశ్ రాజమండ్రిలోనే ఉండి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. 

చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసుల అంశంతో పాటు, అరెస్టుపై టీడీపీ చేపట్టిన నిరసనలపై పార్టీ నేతలతో లోకేశ్ ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు ధర్నా చౌక్ లో కూడా అనుమతించకపోవడం జగన్ నియంత పోకడలకు అద్దం పడుతోందని నారా లోకేశ్ అన్నారు. నిరాహార దీక్ష చేసిన వారిపై కూడా హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్ కు పంపిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని విమర్శించారు. ఇవన్నీ ప్రభుత్వ బలహీనతను, జగన్ భయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్టుతో జగన్ తాత్కాలిక ఆనందం పొంది ఉండవచ్చు కానీ... ప్రజలు దీన్ని ఆమోదించే పరిస్థితి లేదని లోకేశ్ స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టుపై అన్ని వర్గాల్లో అసంతృప్తి, ఆవేదన రోజు రోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై మద్దతు తెలిపిన నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

లోకేశ్ బస చేసిన క్యాంప్ కార్యాలయానికి మాజీ మంత్రులు బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపి కనకమేడల రవీంద్రలతో పాటు... పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు వచ్చి కలిశారు.


More Telugu News