చంద్రబాబుకు మద్దతుగా గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగుల ప్రదర్శన

  • చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణలో కూడా నిరసనలు
  • మధ్యాహ్నం 3 గంటలకు విప్రో సర్కిల్ వద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సంఘీభావ కార్యక్రమం
  • 'ఐయాం విత్ సీబీఎన్' పేరుతో కార్యక్రమం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లోని ఎన్నారైల నుంచి సైతం వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ ను మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి తదితర నేతలు తప్పుపట్టారు. విపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేసే ట్రెండ్ కేంద్రం నుంచి రాష్ట్రాలకు కూడా పాకిందని అఖిలేశ్ విమర్శించారు. ఈ అరెస్ట్ చంద్రబాబుకే లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. 

మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఏపీతో పాటు తెలంగాణలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ వైఖరిని తప్పుపడుతూ టీడీపీ మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. ఇంకోవైపు ఈ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 'ఐయాం విత్ సీబీఎన్' పేరుతో మెయిల్స్, సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఇన్విటేషన్ షేర్ అవుతోంది. 'రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలో చంద్రబాబు బాధితుడు. ఈ సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది' అంటూ దీనికి సంబంధించిన పోస్టర్ లో పేర్కొన్నారు.


More Telugu News