అభ్యంతరం ఉంటే విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేస్తానన్న జడ్జి.. అభ్యంతరం లేదన్న చంద్రబాబు లాయర్

  • గతంలో తాను పీపీగా పని చేశానన్న జడ్జి
  • తనపై అభ్యంతరం ఉంటే చెప్పాలని అడిగిన వైనం
  • అభ్యంతరం లేదని చెప్పడంతో విచారణను కొనసాగించిన జడ్జి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ కు సంబంధించిన విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణ సందర్భంగా కోర్టు హాల్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గతంలో తాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేశానని, మీకు అభ్యంతరాలు ఉంటే విచారణను ఇతర బెంచ్ కు మారుస్తానని చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ లూథ్రాను జడ్జి అడిగారు. నాట్ బిఫోర్ మీ కింద విచారణ నుంచి తప్పుకుంటానని చెప్పారు. అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జడ్జికి లూథ్రా తెలిపారు. దీంతో, ఆయన విచారణను కొనసాగించారు. 

మరోవైపు, కోర్టులో చంద్రబాబుకు అత్యవసర ఊరట లభించలేదు. క్వాష్ పిటీషన్  పై విచారణను మంగళవారం వరకు హైకోర్టు వాయిదా వేయడంతో... మరో ఆరు రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండబోతున్నారు. మరోవైపు చంద్రబాబును సోమవారం వరకు కస్టడీలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో, ఆయనకు కొంత ఊరట లభించినట్టయింది.


More Telugu News