అరకు కాఫీ ప్రపంచంలోనే అత్యుత్తమం: ఆనంద్ మహీంద్రా

  • జీ20 నేతలకు ఇచ్చిన కానుకల్లో అరకు కాఫీ
  • తనను గర్వపడేలా చేసిందన్న పారిశ్రామికవేత్త
  • భారత్ అత్యుత్తమ ఉత్పత్తులకు నిదర్శమని ప్రకటన
  • ట్విట్టర్ లో ప్రత్యేకంగా పోస్ట్
అరకు కాఫీ నాణ్యత, గొప్పదనం గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా ప్రస్తావించారు. జీ20 సదస్సుకు విచ్చేసిన విదేశీ అతిథులకు కేంద్రం ఇచ్చిన బహుమతుల్లో అరకు కాఫీ కూడా ఉండడం గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధాని మోదీ భారత్ కు ఉన్న గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని విదేశీ నేతలకు బహుమతులు ఇవ్వడం ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో అరకు కాఫీతోపాటు, చేతితో చేసిన కళాఖండాలు ఉన్నాయి. 

భారత్ అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను, అంతర్జాతీయ స్థాయిలో తయారు చేయగలదనే దానికి అరకు కాఫీ ఓ స్పష్టమైన ఉదాహరణగా ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ‘‘అరకు ఒరిజినల్స్ బోర్డ్ చైర్మన్ గా ఈ బహుమతి ఎంపికపై నేను వాదించలేను. కాకపోతే ఇది నన్ను ఎంతో గర్వపడేలా చేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, భారత్ లో పెరిగిన రకానికి ఇది కచ్చితమైన ఉదాహరణ’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.  

అరకులో సహజ సిద్ధంగా పండించిన కాఫీ రకానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. దీంతో దీన్ని మరింత ప్రోత్సహించేందుకు వీలుగా దీన్ని విదేశీ అతిథుల కానుకల జాబితాలో చేర్చారు. అరకు గ్లోబల్ హోల్డింగ్స్ ను భారత పారిశ్రామికవేత్తలు.. ఆనంద్ మహీంద్రా, క్రిస్ గోపాలకృష్ణన్, డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సోమా ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ మాగంటి ఏర్పాటు చేశారు. 



More Telugu News