ఇది మా కుటుంబానికి కష్టకాలం... అందరూ అండగా నిలవాలి: నారా భువనేశ్వరి

  • బయటకు వస్తుంటే నాలో ఓ భాగం అక్కడే వదిలేసినట్లుగా ఉందన్న భువనేశ్వరి
  • ఆయన జైల్లోనూ ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని వ్యాఖ్య
  • ఆరోగ్యంగానే ఉన్నానని, భయపడవద్దని తనకు ధైర్యం చెప్పారని వెల్లడి
జైల్లో ఉన్న చంద్రబాబును చూసి బయటకు వస్తుంటే నాలో ఒక భాగం అక్కడే వదిలేసినట్లుగా అనిపించిందని నారా భువనేశ్వరి అన్నారు. రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేతను కలిసేందుకు మంగళవారం భార్య నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి వచ్చారు. చంద్రబాబును కలిసి బయటకు వచ్చాక భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ... ఆయన ఉదయం నుండి రాత్రి వరకు నిత్యం ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి అన్నారు. తాను ఎప్పుడైనా అడిగితే.. తనకు ప్రజలే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబమని చెప్పేవారన్నారు.

అలాంటి వ్యక్తిని ఆయన నిర్మించిన భవనంలోనే ఆయనను కట్టిపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమీ లేని కేసులో ఇరికించి చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ప్రజల కోసం పని చేస్తోందని ఆ కుటుంబ సభ్యురాలిగా తాను హామీ ఇస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆయన జైల్లోనూ ప్రజల కోసమే ఆలోచిస్తున్నారన్నారు. దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలనేది చంద్రబాబు కోరిక అన్నారు.

తాను ఆరోగ్యంగానే ఉన్నానని, బాగున్నానని, భయపడవద్దని తనకు చెప్పారన్నారు. జైల్లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లుగా కనిపించడం లేదన్నారు. చన్నీళ్లతో స్నానం చేయవలసి వస్తోందన్నారు. ఇది తమ కుటుంబానికి, పార్టీకి కష్ట సమయమని, ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఆయన సెక్యూరిటీ గురించే తన భయమన్నారు. టీడీపీ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని, ఏమీ కాదన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ ప్రజలు, క్యాడర్ కోసం నిలుస్తుందన్నారు.


More Telugu News