బాబు అరెస్ట్‌ను ఖండించి, ‘మేఘా’ కంపెనీలో పదవికి రాజీనామా చేసిన మాజీ ఐఏఎస్‌ పీవీ రమేశ్

  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో నిజం లేదంటున్న రమేశ్
  • గతంలో జగన్ సర్కారు సలహాదారుగా పని చేసిన పీవీ
  • రాజీనామా చేయమని ‘మేఘా’ కోరలేదన్న రమేశ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టయిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో నిజం లేదని ప్రకటించి వార్తల్లో నిలిచిన మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ మేఘా కంపెనీలో సలహాదారు పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రమేశ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు నిన్న మేఘా కంపెనీకి లేఖ రాశారు. ఐఏఎస్‌గా రిటైరైన తర్వాత ఏపీ ప్రభుత్వంలో సలహాదారుగా పని చేశారు. అనంతరం మేఘా కంపెనీలో చేరి సలహాదారుగా పీవీ రమేశ్ సేవలు అందిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన ఉన్నట్టుండి మేఘా కంపెనీ నుంచి వైదొలగడం చర్చనీయాంశమైంది. 

స్కిల్ డెవప్‌మెంట్‌ కేసులో నిజానిజాలను నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తానని రమేశ్ ప్రకటించారు. కానీ, ఆ ప్రెస్‌మీట్ జరగలేదు. తమ కంపెనీలో పని చేస్తూ ప్రెస్‌మీట్ పెట్టొద్దని ‘మేఘా’ ఆయనకు సూచించిందని, ఈ విషయంలో మీడియాతో మాట్లాడాలంటే ముందుగా సలహాదారు పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, తనను రాజీనామా చేయమని ‘మేఘా’ ఆదేశించలేదని రమేశ్ ట్వీట్ చేశారు. మేఘా నుంచి వైదొలిగిన నేపథ్యంలో రమేశ్ ప్రెస్‌ పెట్టి స్కిల్ డెవప్‌మెంట్ కేసు గురించి మాట్లాడే అవకాశం ఉంది.


More Telugu News