పిచ్చి వాగుడు వాగితే.. గుడ్లు, నాలుక పీకేస్తాం: కేంద్ర మంత్రి షెకావత్
- సనాతన ధర్మాన్ని దూషించే వారికి హెచ్చరిక
- అలాంటి వారిని ఉపేక్షించబోమన్న కేంద్ర మంత్రి
- ఇలా మాట్లాడేవారు రాజకీయంగా ఎదగలేరని హెచ్చరిక
సనాతన ధర్మంపై పిచ్చి కూతలు కూసే వారికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే సనాతన ధర్మంపై పరుష వ్యాఖ్యలు చేయడం తెలిసే ఉంటుంది. మలేరియా, డెంగీ, ఎయిడ్స్ వంటి వాటితో పోలుస్తూ ఆయన హిందూ మత విశ్వాసాన్ని కించపరిచారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ పిలుపునిచ్చారు. రాజస్థాన్ లోని బర్మర్ లో ఎన్నికల ర్యాలీలో భాగంగా ఈ అంశంపై కేంద్ర మంత్రి షెకావత్ కఠినంగా స్పందించారు.
‘‘మన పూర్వీకులు వారి జీవితాలను పణంగా పెట్టి కాపాడిన సనాతన ధర్మాన్ని కొందరు వ్యక్తులు నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని ఇక ఎంత మాత్రం ఉపేక్షించబోము. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుకలను పీకేస్తాం. దీని పట్ల అలక్ష్యంగా చూస్తే వారి కళ్లను పీకేస్తాం. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వారి రాజకీయ శక్తిని చాటలేరు’’ అని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.
మరోవైపు బీజేపీ ఎంపీ సాధ్వి ప్రాగ్య సైతం దీనిపై స్పందించారు. సనాతన ధర్మాన్ని అంతం చేసే శక్తి ఎవరికీ లేదన్నారు. డీఎంకే నేత ఉదయనిధి, నటుడు ప్రకాష్ రాజ్ సనాతన ధర్మంపై అలాంటి ప్రకటనలు చేస్తే, వారు హీరోలు కాబోరని, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే విలన్లు అవుతారని వ్యాఖ్యానించారు. మనం ఏం చేస్తున్నామనేది కూడా వారికి తెలియదన్నారు.