స్వదేశం వెళ్లేందుకు విమానం కోసం ఢిల్లీలో కెనడా ప్రధాని పడిగాపులు!

  • జీ20 సదస్సుకు హాజరైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో  
  • ఆదివారం తిరుగు ప్రయాణం అవ్వాల్సిన ఎయిర్‌‌బస్‌లో సాంకేతిక సమస్య
  • కెనడా ఆర్మీ పంపించిన ప్రత్యామ్నాయ విమానం లండన్‌కు దారి మళ్లింపు
  • ఇంకా ఢిల్లీలోనే ఉండిపోయిన ట్రూడో 
భారత్ నాయకత్వంలో న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. ఆ సదస్సుకు హాజరైన వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ, సదస్సు ముగిసి రెండ్రోజులు కావొస్తున్న కెనడా ప్రధాని  జస్టిన్ ట్రూడో  మాత్రం భారత్‌లోనే ఉండిపోయారు. ఆదివారమే కెనడాకు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన ఆయనకు విమానం (ఎయిర్ బస్)లో సాంకేతిక సమస్య రూపంలో అవాంతరం ఎదురైంది. 

దాంతో ట్రూడో కోసం మరో విమానం వస్తోందని, ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఆయన పయనమవుతారని సమాచారం వచ్చింది. అయితే కెనడా నుంచి ఆయన కోసం వస్తున్న ప్రత్యామ్నాయ విమానాన్ని లండన్‌కు దారి మళ్లించినట్టు బీబీసీ తెలిపింది. దాంతో, ట్రూడో మరికొంత సమయం ఢిల్లీలోనే ఉండనున్నారు. నేరుగా భారత్ రావాల్సిన విమానాన్ని ఎందుకు దారి మళ్లించారో తెలియడం లేదని బీబీసీ నివేదించింది.

కెనడా ఆర్మీకి చెందిన సీసీ-150 పొలారిస్ విమానం రోమ్ మీదుగా ఢిల్లీకి వస్తుండగా అనూహ్యంగా లండన్‌కు మళ్లించారు. ఇప్పుడు ఆ విమానం లండన్ నుంచి ఢిల్లీ వస్తుందని కెనడా ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. మరోవైపు సాంకేతిక సమస్య తలెత్తడంతో ఢిల్లీలో నిలిపివేసిన కెనడా ప్రధాని అధికారిక విమానం ఎయిర్‌బస్‌ను రిపేర్ చేసేందుకు అవసరమైన విడిభాగాలు, టెక్నీషియన్‌ను భారత్‌కు పంపినట్లు కెనడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రిపేర్ అయి అన్ని ఎయిర్ సేఫ్టీ నిబంధనలకు అనుకూలంగా ఉంటే సదరు ఎయిర్‌ బస్‌ విమానంలోనే ట్రూడో కెనడా చేరుకునే అవకాశం ఉంది.


More Telugu News