పోర్చుగల్ టౌన్ ను ముంచెత్తిన మద్యం వరద.. వీడియో ఇదిగో!

  • ఏకంగా 22 లక్షల లీటర్ల రెడ్ వైన్ రోడ్లపై వరదలా పారింది
  • అకస్మాత్తుగా పేలిన డిస్టిలరీలోని మద్యం ట్యాంకులు
  • బాటిల్స్ లో నింపేందుకు సిద్ధం చేసిన వైన్ మొత్తం నేలపాలు
మద్యం ఏరులా పారుతోందని రాజకీయ నాయకుల ప్రసంగాల్లో వింటుంటాం కానీ పోర్చుగల్ లోని ఓ చిన్న పట్టణవాసులు మాత్రం ఈ వైనాన్ని కళ్లారా చూశారు. ఏరులా పారడం కాదు.. ఏకంగా మద్యం వరదలనే చూశారు. వీధులను రెడ్ వైన్ ముంచెత్తడం చూసి ఇదేం వింత? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోర్చుగల్ లోని లెవీరా పట్టణవాసులకు ఆదివారం ఎదురైందీ వింత అనుభవం. లెవీరాలోని మద్యం తయారీ కంపెనీలో రెడ్ వైన్ తయారవుతుంటుంది. కంపెనీలో ఏర్పాటు చేసిన ట్యాంకుల్లోకి చేరుతుంటుంది. ఈ ట్యాంకుల నుంచి బాటిల్స్ లో నింపి, వాటిని మార్కెట్ లోకి పంపిస్తుంటారు.

ఆదివారం కూడా కంపెనీ సిబ్బంది తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే మద్యం నిల్వ చేసే ట్యాంకులు ఉన్నట్టుండి పేలిపోయాయి. దీంతో అందులో నిల్వ చేసిన సుమారు 22 లక్షల లీటర్ల రెడ్ వైన్ నేల పాలైంది. కంపెనీ పక్కనే ఉన్న ఓ ఇంటి బేస్ మెంట్ ను ముంచెత్తింది. ఆపై వరదలా రోడ్లను ముంచెత్తింది. రోడ్లు వాలుగా ఉండడంతో వరద మొత్తం దగ్గర్లోని నదివైపుగా ప్రయాణించింది. ఇంతలో సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ సహా ఎమర్జెన్సీ టీంలు రంగంలోకి దిగి నది కలుషితం కాకుండా చర్యలు చేపట్టాయి. రెడ్ వైన్ వరదను పొలాల్లోకి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ రెడ్ వైన్ వరదను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.


More Telugu News